Kalti Kallu: మహబూబ్ నగర్ జిల్లాలో కల్తీ కల్లు బాధితులు, మృతుల సంఖ్య పెరుగుతుండటం కలకలం రేపుతోంది. జిల్లా ఆస్పత్రికి కల్తీ కల్లు బాధితులు క్యూ కడుతూనే ఉన్నారు. సుమారు ఆరు రోజులుగా బాధితులకు చికిత్స కొనసాగుతూనే ఉంది. 40 మందికిపైగా బాధితులు ఆస్పత్రిలో చేరగా… వారిలో ఇప్పటివరకు ముగ్గురు మృతి చెందారు. చనిపోయినవారిలో కోడూరుకు చెందిన అంజయ్య, అంబేద్కర్‌నగర్‌కు చెందిన విష్ణుతోపాటు మరొకరు ఉన్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నవారిలో పలువురి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. అయితే, మృతుల, బాధితుల వివరాలను గోప్యంగా ఉంచుతున్నారు ఆసుపత్రి సిబ్బంది. మృతుల కుటుంబాలతో కల్లు కాంపౌండ్ నిర్వాహకులు బేరసారాలు చేస్తున్నారు. బాధితుల వివరాలు వెల్లడించొద్దని ఆసుపత్రి సిబ్బందిపై ఎక్సైజ్ శాఖాధికారులు ఒత్తిడి చేస్తున్నట్టు తెలిసింది. దీంతో కల్తీ కల్లు వ్యవహారంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Read Also: Balineni Srinivasa Reddy: మళ్లీ అలిగిన బాలినేని… సీఎం జగన్ బుజ్జగింపులు
కల్తీకల్లు వ్యవహారంపై మంత్రి శ్రీనివాస్‌గౌడ్ స్పందించారు. కల్లు శాంపిల్స్‌ను FCLకు పంపించామని, ఆ రిపోర్ట్ వచ్చే వరకు అది కల్తీకల్లు అని చెప్పలేమని ఆయనన్నారు. FCL రిపోర్ట్ ఆధారంగా చర్యలు తీసుకుంటామన్నారు. కల్తీ కల్లు మరణాలకు మంత్రి శ్రీనివాస్‌గౌడ్ బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు బీజేపీ నాయకురాలు డీకే అరుణ. కల్తీకల్లు వ్యవహారమంతా శ్రీనివాస్‌గౌడ్ కనుసన్నల్లోనే నడుస్తోందని ఆమె ఆరోపించారు. మహబూబ్‌నగర్ జిల్లాలో కల్తీ కల్లు ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారినా కానీ.. దీనిపై ఎక్సైజ్ అధికారులు ఎలాంటి కేసు నమోదు చేయకపోవడంతో పలు అనుమాలు వ్యక్తమవుతున్నాయి.