NTV Telugu Site icon

Kaikala Satyanarayana: స్టార్స్ తో స‌త్య‌నారాయ‌ణ చిత్రాలు!

Kaikala

Kaikala

Kaikala Satyanarayana: నాటి మేటి న‌టులు య‌న్టీఆర్, ఏయ‌న్నార్, కృష్ణ‌, శోభ‌న్ బాబుతోనూ త‌రువాతి త‌రం స్టార్ హీరోల‌యిన చిరంజీవి,బాల‌కృష్ణ‌తోనూ స‌త్య‌నారాయ‌ణ సొంత చిత్రాలు నిర్మించ‌డం విశేషం. య‌న్టీఆర్ ద్విపాత్రాభిన‌యంతో తెర‌కెక్కిన `గ‌జ‌దొంగ‌` చిత్ర నిర్మాణంలో చ‌ల‌సాని గోపితో క‌ల‌సి పాలు పంచుకున్నారు స‌త్య‌నారాయ‌ణ‌. తాను ఎన్నో చిత్రాల‌లో య‌న్టీఆర్ డ్యుయ‌ల్ రోల్ పోషించ‌గా, ఆయ‌న‌కు డూప్ గా న‌టించారు స‌త్య‌నారాయ‌ణ‌. అందువ‌ల్లేనేమో య‌న్టీఆర్ తో తాను నిర్మించిన `గ‌జ‌దొంగ‌` చిత్రాన్ని రామారావు ద్విపాత్రాభిన‌యంతోనే నిర్మించారు. కె.రాఘ‌వేంద్ర‌రావు ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఆ సినిమా ఘ‌న‌విజ‌యం సాధించింది. ఇక ఏయ‌న్నార్ హీరోగా దాస‌రి నారాయ‌ణ రావు ద‌ర్శ‌క‌త్వంలో స‌త్య‌నారాయ‌ణ‌, త‌న త‌మ్ముడు కైకాల నాగేశ్వ‌ర‌రావు నిర్మాత‌గా `బంగారు కుటుంబం` చిత్రం నిర్మించారు. ఆ సినిమా కూడా మంచివిజ‌యం సాధించ‌డ‌మే కాదు, 1994లో ఉత్త‌మ చిత్రంగా బంగారు నందిని అందుకుంది. నిజానికి స‌త్య‌నారాయ‌ణ, కృష్ణ హీరోగా నిర్మించిన `మామాఅల్లుళ్ల స‌వాల్`తోనే నిర్మాత‌గా మారారు. ర‌మా పిలిమ్స్ ప‌తాకంపై తెర‌కెక్కిన ఈ చిత్రానికి కె.ఎస్.ఆర్.దాస్ ద‌ర్శ‌కులు. శ్రీ‌దేవి నాయిక‌గా న‌టించిన ఈ చిత్రం అప్ప‌ట్లో జ‌నాద‌ర‌ణ చూర‌గొంది. త‌రువాత కృష్ణ‌, శోభ‌న్ బాబు హీరోలుగా కె.రాఘ‌వేంద్ర‌రావు ద‌ర్శ‌క‌త్వంలో `ఇద్ద‌రు దొంగ‌లు` చిత్రం నిర్మించారు. ఈ సినిమా 1984 సంక్రాంతి కానుక‌గా విడుద‌లై మంచి విజ‌యం సాధించింది. 1986లో శోభ‌న్ బాబు హీరోగా కె.ముర‌ళీమోహ‌న రావు ద‌ర్శ‌క‌త్వంలో `అడ‌వి రాజా` చిత్రాన్ని నిర్మించారు స‌త్య‌నారాయ‌ణ‌. ఈ సినిమా ఓ మోస్త‌రుగా అల‌రించింది.

Read Also: Satyanarayana in Hindi: హిందీలో స‌త్య‌నారాయ‌ణ‌!

త‌రువాతి త‌రం హీరోల‌యిన చిరంజీవితో స‌త్య‌నారాయ‌ణ `కొద‌మ‌సింహం` కౌబోయ్ మూవీని నిర్మించారు. కె.ముర‌ళీమోహ‌న రావు ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రం తెర‌కెక్కింది. హిందీలో ప్రాణ పోషించిన ప‌లు పాత్ర‌ల‌ను తెలుగులో స‌త్య‌నారాయ‌ణ ధ‌రించి ఆక‌ట్టుకున్నారు. అలా “నిప్పులాంటి మ‌నిషి, యుగంధ‌ర్, నా పేరే భ‌గ‌వాన్“ వంటి సినిమాలలో హిందీలో ప్రాణ చేసిన పాత్ర‌ల‌ను తెలుగులో స‌త్య‌నారాయ‌ణ ధ‌రించి ఆక‌ట్టుకున్నారు. అందువ‌ల్ల ప్రాణ్ అంటే స‌త్య‌నారాయ‌ణ‌కు ఎంతో అభిమానం. ఆ అభిమానంతోనే ఇందులో ఓ కీల‌క పాత్ర‌ను ప్రాణ్ ను ఎంచుకున్నారు స‌త్య‌నారాయ‌ణ‌. “త‌న‌కు న‌టునిగా గుర్తింపు సంపాదించి పెట్టిన హిందీ రీమేక్స్ లో ప్రాణ్ పోషించిన పాత్ర‌లు తెలుగులో నాకు ఎంతో పేరు సంపాదించాయి. ఈ విధంగానైనా నా అభిమాన న‌టుడు ప్రాణ్ ను స‌న్మానించుకున్నాను“ అంటూ స‌త్య‌నారాయ‌ణ అన్నారు. ఇక బాల‌కృష్ణ హీరోగా ఎ.కోదండ‌రామిరెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో `ముద్దుల మొగుడు` అనే చిత్రాన్ని నిర్మించారు స‌త్య‌నారాయ‌ణ‌. ఈ రెండు చిత్రాలు త‌మ రమాఫిలిమ్స్ ప‌తాకంపైనే నిర్మించారు. `కొద‌మ‌సింహం` కంటే ముందు ఇత‌రుల‌తో క‌ల‌సి చిరంజీవి హీరోగా `చిరంజీవి` అనే చిత్రాన్ని నిర్మించారు స‌త్య‌నారాయ‌ణ‌. ఇలా నిర్మాత‌గానూ స‌త్య‌నారాయ‌ణ అల‌రించారు.

Show comments