జూబ్లీహిల్స్ సస్పెన్స్ థ్రిల్లర్ ఇటు తెలంగాణ, అటు ఏపీలో బెట్టింగ్ రాయుళ్లకు పండగలా మారింది. కోట్ల రూపాయల బెట్టింగ్ చేతులు మారుతోంది. హైదరాబాద్‌లో వుంటున్న బంధువులను వాకబు చేస్తూ మరీ…పందెం కాస్తున్నారు.
జూబ్లీహిల్స్ బైపోల్ రోజురోజుకు ఉత్కంఠ పెంచుతోంది. మారుతున్న సమీకరణలు, విసురుతున్న సవాళ్లు… వేస్తున్న వ్యూహాలతో ఎవరు గెలుస్తారోనన్న సస్సెన్స్ ట్వంటీ20 మ్యాచ్‌ను తలపిస్తోంది. అన్‌ప్రిడిక్టబుల్ గా మారిన జూబ్లీహిల్స్ పోరు..సహజంగానే బెట్టింగ్ రాయుళ్లను టెమ్ట్ చేస్తోంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో జూబ్లీహిల్స్ ఎన్నికపై కాయ్ రాజా కాయ్ వ్యవహారం కోడి పందేల రేంజ్‌లో సాగుతోంది.
జూబ్లీహిల్స్ ఎన్నిక నోటిఫికేషన్ వచ్చిన నాటి నుంచే ఆంధ్రప్రదేశ్‌లో పందేల జోరు మొదలైంది. చాలామంది సొంతంగా సర్వేలు చేయించుకున్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం ప్రాంతాలతో పాటు హైదరాబాద్‌లోని ఇతర ఏరియాల్లోని తమ బంధువులకు ఫోన్లు చేసి..ఎవరు గెలస్తారు…ఏ పార్టీకి వాతావరణం అనుకూలంగా వుందంటూ ఆరా తీస్తున్నారు. అయితే, ఒక్కొక్క ఏరియాలో, ఒక్కో ట్రెండ్ వస్తుండటంతో…పలానా పార్టీ గెలుస్తుందన్న అభిప్రాయానికి రాలేకపోతున్నారు. దీంతో ఏ పార్టీ విజయ బావుటా ఎగరేస్తుందంటూ జోరుగా పందేలు కాస్తున్నారు. ఇప్పటి వరకు దాదాపు ఆరు వందల కోట్ల రూపాయల పందేలు కాసినట్టు తెలుస్తోంది. ఎన్నికల నాటికి ఇది కాస్తా 14 వందల కోట్లకు చేరొచ్చని అంచనా వేస్తున్నారు.
ఇటు తెలంగాణలోనూ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బెట్టింగ్ పై ఎవరూ తగ్గడం లేదు. పందెం రాయళ్లు ఎంతపడితే అంత డబ్బులు పెట్టేస్తున్నారు. ఒక ఏరియాలోని 10 మంది కలిసి పాతిక కోట్ల బెట్టింగ్ కాశారని ప్రచారం జరుగుతోంది. ఇంకా చాలా చోట్ల కోట్లలో పందేలు నిర్వహిస్తున్నారని తెలుస్తోంది. అటు ఏపీ, ఇటు తెలంగాణలో ప్రత్యేక సర్వేలకు 70 వేల నుంచి లక్ష చెల్లిస్తున్నాయి. పెద్ద ఏజెన్సీలకైతే 3 లక్షల దాకా ఇస్తున్నట్టు సమాచారం. పక్కా సమాచారంతో బెట్టింగ్ కాసి…కోట్లు కొల్లగొట్టాలని పందేలకు సై అంటున్నారు. మొత్తానికి ఉత్కంఠగా మారిన జూబ్లీహిల్స్ ఎన్నిక అటు ఏపీ, ఇటు తెలంగాణలో పెద్ద ఎత్తున బెట్టింగ్ మనీ చేతులు మారేలా చేస్తోంది.