Terrible Incident: పురిటి నొప్పులతో బాధపడుతూ ఆసుపత్రికి వెళ్లిన గర్భిణికి ప్రసవం చేయాల్సిన వైద్యాధికారి, ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారు. దీంతో గర్భంలోనే శిశువు మృతి చెందిన సంఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
కాటారం మండలం చిదినెపల్లికి చెందిన కొండు హరిత పురిటి నొప్పులతో అక్టోబర్ 28న కాటారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లారు. పరీక్షించిన వైద్యురాలు నొప్పులు రావడానికి ఇంజక్షన్ ఇచ్చారని బాధితురాలు తెలిపారు. అక్టోబర్ 29న సాయంత్రం నొప్పులు ఎక్కువ కావడంతో వైద్యురాలు, సిబ్బంది సాధారణ ప్రసవం చేసేందుకు ప్రయత్నించారు. నొప్పి భరించలేక పోతున్నాని శస్త్రచికిత్స చేయాలని వైద్యురాలిని కోరినా సాధారణ ప్రసవం అవుతుందని అలాగే పొట్టను గట్టిగా నెట్టారని తెలిపారు. బుధవారం ఉదయం ఉమ్ము నీరు మొత్తం బయటకు పోయినా వైద్యురాలు వచ్చి సాధారణ ప్రసవం అవుతుందని తెలిపి మళ్లీ పొట్టను నెట్టే ప్రయత్నం చేస్తే తనను జిల్లా ఆసుపత్రికి పంపించాలని కోరినట్లు చెప్పారు.
కడుపులో శిశువు కదలికలు ఆగిపోవడంతో హార్ట్ బీట్ ఎలా ఉందని వైద్యాధికారిని అడిగితే బాగానే ఉందని పంపించారన్నారు. అక్కడి నుంచి జిల్లా జనరల్ ఆసుపత్రికి వచ్చాక అక్కడి వైద్యాధికారులు శస్త్ర చికిత్స చేయగా అప్పటికే శిశువు మృతి చెందిందని వైద్యులు తెలిపినట్లు ఆమే పేర్కొన్నారు. కాటారం పీహెచ్సీ వైద్యురాలు నిర్లక్ష్యంతోనే గర్భస్థ శిశువు మృతి చెందిందని తనకు న్యాయం చేయాలని బాధిత మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. ఇలాంటి వైద్యులు, సిబ్బంది వున్నంత కాలం గర్భంలోనే శిశువులను పోగొట్టుకోవాల్సి వస్తుందని వాపోయింది. ఇప్పటికైనా కాటారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని వైద్యులను, సిబ్బంది తొలగించాలని, కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారనేదానిపై ఆశక్తి నెలకొంది.
Telangana: బాబోయ్ పులి.. నిర్మల్ రైతులకు దడ పుట్టిస్తున్న బెబ్బులి..