Pawan Kalyan: టీడీపీ-జనసేన ప్రభుత్వంలో ఏ పథకం ఆగదు.. మరింత సంక్షేం ఇచ్చేలా జనసేన-టీడీపీ వ్యవహరిస్తాయి అని స్పష్టం చేశారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.. ప్రమాదవశాత్తు మృతిచెందిన క్రియాశీలక సభ్యుల కుటుంబాలకు రూ.5 లక్షల బీమా చెక్కులను అందించిన పవన్ కల్యాణ్.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జనసేన – టీడీపీ వస్తే పథకాలు ఆపేస్తారంటూ వైఎస్ జగన్ తప్పుడు ప్రచారం చేస్తున్నారన్న ఆయన.. మేం మరింత ఇస్తామే తప్ప.. ఏదీ ఆపం అని క్లారిటీ ఇచ్చారు.. ఇక, డ్వాక్రా రుణాల మాఫీపై అధ్యయనం చేస్తున్నాం.. డ్వాక్రా రుణాల మాఫీపై టీడీపీతో చర్చిస్తున్నాం అని వెల్లడించారు. పెద్ద పెద్ద మోసం చేసే కంపెనీలకు, బ్యాంకులు రుణాలిచ్చి వదిలేస్తున్నాయి. డ్వాక్రా మహిళలకు ఏ విధంగా రుణ మాఫీ చేయాలోననే అంశంపై ఆలోచన చేస్తున్నాం అన్నారు.
Read Also:Sharad Pawar: శరద్ పవార్ కొత్త పార్టీ.. ఈసీ గ్రీన్‌సిగ్నల్
ఇక, జనసేన-టీడీపీ ప్రభుత్వం మరింత సంక్షేమం అందిస్తుంది తప్పితే.. ఏ పథకం ఆగదు అని స్పష్టం చేశారు పవన్.. సొంత డబ్బులను పేదల కోసం ఖర్చు పెడుతున్నాను.. సంక్షేమ పథకాలు ఎలా ఆపుతాం..? అని నిలదీశారు. చనిపోయిన కార్యకర్తల కుటుంబాలకు చెక్కులిచ్చే సందర్భంలో బాధేస్తోందన్న ఆయన.. చనిపోయిన కార్యకర్తల కుటుంబాలకు ఇచ్చే రూ. 5 లక్షలు పెద్ద మొత్తం కాదు.. కానీ, వారికి కాస్తో కూస్తో చేయూతనిస్తోందన్నారు. కేవలం బీమా చెక్కులను అందించడంతో ఆగకుండా.. మృతి చెందిన కార్యకర్తల కుటుంబాలను ఆదుకోవడానికి మరింత పని చేసే ఆలోచన ఉందన్నారు. కార్యకర్తల సంక్షేమ నిధిని ఏర్పాటు చేయాలనుకుంటున్నాం. చనిపోయిన కార్యకర్తల కుటుంబాన్ని ఆదుకోవడానికి.. ఆ కుటుంబాల్లోని పిల్లలను చదివించాలనే ఆలోచన ఉందన్నారు. కొందరికి అధికారం ఉన్నా.. మనస్సు ఉండదు.. కానీ, జనసేనకు మానవతా ధృక్పధం ఉంది.. మావనతా ధృక్పథానికి అధికారం తోడైతే ఇంకా బాగుంటుందన్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.