Jailer 2 : బాక్సాఫీస్ వద్ద ‘జైలర్ 2’ ఊచకోత.. కానీ ఆ రెండు రికార్డులు మిస్

Jailer 2

Jailer 2

సూపర్ స్టార్ రజనీకాంత్, దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ కాంబినేషన్‌లో వచ్చిన ‘జైలర్ 2’ బాక్సాఫీస్ వద్ద సంచలన వసూళ్లు రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల సునామీ సృష్టించిన ఈ చిత్రం, ఓవర్సీస్‌తో పాటు కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో ఆల్ టైమ్ రికార్డులను తిరగరాసింది. అయితే, ఇంతటి భారీ విజయం సాధించినప్పటికీ, రజనీకాంత్ కెరీర్‌లో మైలురాయిగా నిలవాల్సిన రెండు ప్రతిష్టాత్మక రికార్డులు మాత్రం తృటిలో చేజారిపోయాయి. ముఖ్యంగా సొంత రాష్ట్రం తమిళనాడులో ‘జైలర్ 2’ రెండో స్థానానికే పరిమితం కావడం ఇప్పుడు కోలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

సాధారణంగా రజనీకాంత్ సినిమా విడుదలైతే తమిళనాడు బాక్సాఫీస్ రికార్డులు బద్దలవడం ఖాయం. కానీ ‘జైలర్ 2’ విషయంలో సీన్ రివర్స్ అయింది. థియేట్రికల్ రన్ ముగిసే సమయానికి తమిళనాడులో ఈ సినిమా రూ. 221 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. కానీ 2023లో విడుదలైన దళపతి విజయ్ బ్లాక్ బస్టర్ ‘లియో’ తమిళనాడులో సాధించిన రూ. 224 కోట్ల రికార్డును రజనీ చిత్రం అధిగమించలేకపోయింది. కేవలం 3 కోట్ల తేడాతో సొంత గడ్డపై నెంబర్ 1 స్థానాన్ని కోల్పోయి, సెకండ్ ప్లేస్‌తోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇటు రజనీ ఫ్యాన్స్, అటు విజయ్ ఫ్యాన్స్ మధ్య ఈ నంబర్ల విషయంలో సోషల్ మీడియాలో పెద్ద చర్చే నడుస్తోంది.

తమిళనాడు తర్వాత రజనీకాంత్‌కు అంతటి భారీ మార్కెట్ ఉన్న తెలుగు రాష్ట్రాల్లోనూ ‘జైలర్ 2’కు ఊహించని షాక్ తగిలింది. విడుదలైన మొదటి వారం నుంచే వసూళ్ల వర్షం కురిపించిన ఈ చిత్రం, తెలుగు రాష్ట్రాల్లో 100 కోట్ల గ్రాస్ క్లబ్‌లో చేరుతుందని ట్రేడ్ వర్గాలు గట్టిగా నమ్మాయి. కానీ, ఫుల్ రన్ ముగిసే సరికి తెలుగు వెర్షన్ రూ. 99.65 కోట్ల గ్రాస్ వద్దే ఆగిపోయింది. కేవలం 35 లక్షల రూపాయల తేడాతో సెంచరీ మార్కును మిస్ చేసుకోవడం డిస్ట్రిబ్యూటర్లను, అభిమానులను కాస్త నిరాశపరిచింది. మొత్తానికి ఓవర్సీస్, పొరుగు రాష్ట్రాల్లో తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శించిన ‘జైలర్ 2’, తమిళనాడులో విజయ్ ‘లియో’ రికార్డును కొట్టలేకపోవడం, తెలుగులో వంద కోట్ల మైలురాయికి అడుగు దూరంలో నిలిచిపోవడం బాక్సాఫీస్ వద్ద ఆసక్తికర చర్చకు దారితీసింది.