Shocking Incident at Jagtial Girls’ Junior College: దొంగల్లో కూడా ‘వెరైటీ దొంగ’ ఏంట్రా అని అనుకుంటున్నారా?. దొంగతనం చేయడం నేరమే అయినా.. అందులో ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్ ఉంటుంది. కొందరు దొంగలు బంగారం, డబ్బు దోచేస్తారు. మరికొందరు ఇంట్లోని విలువైన వస్తువులు కొట్టేస్తాడు. ఇంకొందరు అయితే బట్టలు, చెప్పులు సర్ధేస్తారు. ఇప్పుడు మనం చెప్పుకునే దొంగ విలువైన వస్తువులు ఏవీ ముట్టుకోడు. కేవలం బుక్స్ మాత్రమే దొంగతనం చేస్తాడు.
జగిత్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ బాలికల కళాశాలలో గత కొన్ని రోజుల నుంచి విద్యార్థుల పుస్తకాలు మాయం అవుతున్నాయి. కళాశాలలో విలువైన కంప్యూటర్లు, ఇతర వస్తువులు ఏవీ దొంగతనంకు గురవవడం లేదు. వరుసగా పుస్తకాలు చోరీ గురవుతున్నా.. దొంగ ఎవరో తెలియలేదు. బోనాల పండుగ సందర్భంగా హాలిడే ఉండటంతో కళాశాలలోని విద్యార్థులు తమ పుస్తకాలు వదిలి వెళ్లారు. పండుగ అనంతరం వచ్చి చూసేసరికి పుస్తకాలు లేకపోవడంతో.. అందరూ షాక్ అయ్యారు.
Also Read: TSRTC Milestone: మరో మైలురాయి దాటిన తెలంగాణ ఆర్టీసీ.. విజయవంతంగా 19 నెలలు!
విద్యార్థులు జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేశారు. టీచర్లకు డౌట్ వచ్చి సీసీ కెమెరాలు పరిశీలిస్తే.. ఈ పుస్తకాల దొంగ వ్యవహారం బయటపడింది. సదరు దొంగ కళాశాలలో విలువైన వస్తువులు దొంగిలించకుండా.. కేవలం పుస్తకాలు మాత్రమే ఎక్కుకెళుతున్నాడు. కెమెరాల ద్వారా వ్యవహారం బయటపడటంతో ఉపాధ్యాయులు జగిత్యాల పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు పుస్తకాల దొంగ కోసం ఆరా తీస్తున్నారు. ప్రహరీ గోడ లేకపోవడం వల్ల ఈ దొంగతనం జరిగిందని, కాలేజీలో సరైన వసతులు కూడా లేవని విద్యార్థినిలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.