Site icon NTV Telugu

Jagan Mohan Reddy: రాష్ట్రంలో మాఫియాలు రాజ్యమేలుతున్నాయి..!

Jagan Mohan Reddy

Jagan Mohan Reddy

Jagan Mohan Reddy: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అమరావతిలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా రాష్ట్ర పాలన, అవినీతి, అమరావతిలో జరుగుతున్న దోపిడీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఇందులో భాగంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో మట్టి మాఫియా, ఇసుక మాఫియా వంటి అన్ని రకాల మాఫియాలు రాజ్యమేలుతున్నాయని అన్నారు. తమ హయాంలో వర్షాకాలం కోసం 80 వేల టన్నుల ఇసుక నిల్వ చేసినప్పటికీ, టీడీపీ ప్రభుత్వం వచ్చాక రెండు నెలల్లోనే మొత్తం ఇసుకను ఊడ్చేశారని తెలిపారు.

Read Also: Jagan Mohan Reddy: రాష్ట్ర ఖజానాను ప్రైవేట్ వ్యక్తులకు తాకట్టు.. ప్రభుత్వంపై జగన్ ఫైర్..!

అలాగే, అమరావతిలో జరిగిన అవకతవకలపై జగన్ ఆరోపణలు గుప్పించారు. గతంలో పూర్తయిన పనులకు మళ్లీ టెండర్లు పిలిచి.. మిగిలిన పనుల అంచనాలు విపరీతంగా పెంచి దోపిడీ చేస్తున్నారని మండిపడ్డారు. దీనికోసం జ్యుడీషియల్ ప్రివ్యూను తొలగించారని, రివర్స్ టెండరింగ్ ను రద్దు చేసి మొబలైజేషన్ అడ్వాన్సులు మళ్లీ తీసుకొచ్చారని తెలిపారు. ప్రస్తుత సచివాలయం, అసెంబ్లీ కాంప్లెక్స్‌లు కలిపి 6 లక్షల చదరపు అడుగుల నిర్మాణాలు ఉన్నా, కొత్తగా 53 లక్షల చదరపు అడుగులు నిర్మించాలనుకుంటుండటాన్ని జగన్ ప్రశ్నించారు. ఈ నిర్మాణాలు అవసరమేనా అని అడుగుతూ.. ప్రజాధనాన్ని వృథా చేస్తున్నారని ఆరోపించారు. ఒక్క కిలోమీటర్ రోడ్ నిర్మాణానికి రూ.50 కోట్లు ఖర్చు చేస్తుండడంపై కూడా విమర్శలు చేశారు.

Read Also: Jagan Mohan Reddy: అభివృద్ధి ఎక్కడ కనిపించనేలేదు.. సంక్షేమం ఊసే లేదు..!

ప్రస్తుత టీడీపీ ప్రభుత్వం ప్రజలపై అప్పుల భారం పెంచుతున్నారని జగన్ తెలిపారు. ఇప్పటికే అమరావతి కోసం రూ.52 వేల కోట్ల అప్పులు చేశారని, మొత్తం 77 వేల కోట్లు కావాలని ఫైనాన్స్ కమిషన్‌కు వివరించారని చెప్పారు. ప్రజలపై వేస్తున్న ఈ భారం తీవ్రంగా కలవరపెడుతోందన్నారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం దాటినప్పటికీ ఎలాంటి కొత్త పధకాలు అమలు కాలేదని ఆయన అన్నారు. అలాగే తమ ప్రభుత్వ హయాంలో అమలైన రైతు భరోసా, అమ్మఒడి, వసతి దీవెన, ఫీజు రీయింబర్స్మెంట్, ఆరోగ్య బీమా వంటి పథకాలు నిలిపివేయబడ్డాయని విమర్శించారు. ప్రజలకు నష్టమే తప్ప లాభం ఏమీ కనిపించడంలేదన్నారు.

అలాగే రాష్ట్రంలోని లిక్కర్ స్కాం ఆరోపణలపై జగన్ స్పష్టత ఇచ్చారు. తమ హయాంలో మద్యం విక్రయాలు తగ్గి, ప్రభుత్వ ఆదాయం పెరిగిందని తెలిపారు. 2023–24లో రూ.25,082 కోట్లు ఆదాయం వచ్చిందని, టీడీపీ హయంలో అదే ఆదాయం కేవలం రూ.2,623 కోట్లు మాత్రమేనని తెలిపారు. మద్యం షాపులు ప్రభుత్వమే నడిపితే లంచాల ప్రశ్నే లేదని, టీడీపీ హయంలో ప్రైవేటు మాఫియా చేతిలో వ్యాపారం జరిగిందని విమర్శించారు. మొత్తంగా వాస్తవాలను ఆధారాలతో ప్రజల ముందు ఉంచుతున్నామని జగన్ స్పష్టం చేశారు. చంద్రబాబు పాలనపై తీవ్ర విమర్శలు చేస్తూ.. ఇది దోపిడీ పాలన, అప్పుల పాలన, మాఫియా పాలనగా ముద్రవేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Exit mobile version