Jagadish Reddy : నల్లగొండ జిల్లా రాజకీయ వేడిని మరోసారి పెంచుతూ బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం, మంత్రులపై తీవ్ర విమర్శలు చేశారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఇద్దరు మంత్రులు ఉన్నా వ్యవసాయ రంగం దుర్దశను ఎదుర్కొంటోందని ఆయన ఆరోపించారు. ఇప్పటివరకు పంటలకు బోనస్ ఇవ్వకపోవడం, రుణమాఫీ అంశం పూర్తిగా మర్చిపోయిన పరిస్థితి వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు.
ప్రస్తుత మంత్రులు ప్రజాసమస్యలను పట్టించుకోకుండా కేవలం కమిషన్లకే పరిమితమయ్యారని, దళారులకు అమ్ముడుపోయారంటూ ఆయన విమర్శించారు. ఎవరు ప్రశ్నించినా వారిపై అక్రమ కేసులు పెట్టడం ప్రభుత్వ విధానంగా మారిపోయిందని ఆయన ఆరోపించారు. ప్రజా సమస్యలు పక్కన పెట్టి, హెలికాప్టర్లలో విహరిస్తూ మంత్రులు సుఖ జీవితం సాగిస్తున్నారని మండిపడ్డారు.
ఇంకా అధికార యంత్రాంగంపై కూడా ఆయన విమర్శలు గుప్పించారు. జిల్లా కలెక్టర్ ప్రభుత్వం నిబంధనల ప్రకారమే పనిచేయాలని, కాంగ్రెస్ కార్యకర్తలా వ్యవహరించకూడదని హెచ్చరించారు. పోలీస్ వ్యవస్థ కూడా నియమ నిబంధనలకు లోబడి పనిచేయాలని, లేకుంటే ఆ విధంగా వ్యవహరించిన వారిపై ప్రజాస్వామ్యంలో తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుందని హెచ్చరించారు.
ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన జగదీష్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులను అక్రమ కేసులతో వేధిస్తే దీని పరిణామాలు తీవ్రమవుతాయని హెచ్చరించారు. నల్లగొండ జిల్లాలో రాజకీయంగా ఉత్కంఠ పెరుగుతుండటంతో, ఆయన వ్యాఖ్యలు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి.
Waqf Bill: “వక్ఫ్ బిల్లు”ను వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో కాంగ్రెస్ ఎంపీ పిటిషన్..