Site icon NTV Telugu

Jabardasth Bobby : రోడ్డు ప్రమాదంలో జబర్దస్త్ కమెడియన్ మృతి.. కంటతడి పెట్టిన సుమ!

Jabardasth Comedian Bobby Passes

Jabardasth Comedian Bobby Passes

తెలుగు బుల్లితెరపై ‘జబర్దస్త్’.. ‘సుమ అడ్డా’ వంటి కార్యక్రమాల ద్వారా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు లక్ష్మీనారాయణ (బాబీ) రోడ్డు ప్రమాదంలో కన్నుమూశారు. రాజమండ్రిలోని రోడ్డు కం రైల్వే బ్రిడ్జిపై సోమవారం రాత్రి జరిగిన ఈ ప్రమాదం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అతివేగంగా వచ్చిన రెండు బైక్‌లు బలంగా ఢీకొనడంతో ఈ అనర్థం జరిగింది. ఈ ప్రమాదంలో బాబీతో పాటు అక్షయ్ కుమార్, సత్యకుమార్ అనే మరో ఇద్దరు యువకులు కూడా ప్రాణాలు కోల్పోవడం అందరినీ కలచివేస్తోంది.

Also Read : Varanasi Update: ‘అవతార్’తో పోల్చొద్దు.. జేమ్స్ కామెరూన్‌పై రాజమౌళి రియాక్షన్!

హెల్మెట్లు ధరించకపోవడం, అతివేగమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. బాబీ మరణవార్త విన్న వెంటనే స్టార్ యాంకర్ సుమ కనకాల తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. హైదరాబాద్ నుండి హుటాహుటిన రాజమండ్రి చేరుకున్న సుమ, బాబీ భౌతికకాయానికి నివాళులర్పించారు. ఎప్పుడూ నవ్వుతూ అందరినీ నవ్వించే బాబీని అలా విగతజీవిగా చూడటంతో సుమ కంటతడి పెట్టారు. కుటుంబ సభ్యులను ఓదార్చిన ఆమె, బాబీ మృతి టెలివిజన్ రంగానికి తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు. జబర్దస్త్ కమెడియన్లు.. ఇతర సినీ ప్రముఖులు కూడా సోషల్ మీడియా వేదికగా బాబీకి నివాళులర్పిస్తున్నారు. ప్రతిభావంతుడైన ఒక యువ నటుడు ఇలా చిన్న వయసులోనే ప్రమాదానికి గురై చనిపోవడం బుల్లితెర ప్రేక్షకులను కూడా విషాదంలో ముంచెత్తింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Exit mobile version