తమ ప్రణాళికలు ఎప్పుడూ ఒకేలా ఉంటాయని, పాజిటివ్ క్రికెట్ ఆడతాం అని సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్) సహాయక కోచ్ సైమన్ హెల్మోట్ తెలిపారు. తమ దూకుడైన ఆటతీరును కొనసాగిస్తామని చెప్పారు. గతంలో విజయం సాధించినా, ఓడినా సరే దానిని పక్కన పెట్టేయాలన్నారు. ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మలకు తమ మద్దతు ఎప్పుడూ ఉంటుందని సైమన్ చెప్పుకొచ్చారు. సొంతగడ్డపై ఎస్‌ఆర్‌హెచ్ మరో సవాల్‌కు సిద్ధమైంది. ఆదివారం రాత్రి 7.30కు ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్‌ను సన్‌రైజర్స్ ఢీకొట్టనుంది.
ఐపీఎల్ 2025లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇప్పటివరకు నాలుగు మ్యాచ్‌లు ఆడి.. ఒక విజయం సాధించి, మూడింటిలో ఓడింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఎస్‌ఆర్‌హెచ్ అట్టడుగు స్థానంలో ఉంది. ఉప్పల్ మైదానంలో నేడు కీలక మ్యాచ్ ఆడనుంది. గుజరాత్ టైటాన్స్ మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్ ఓడిపోతే మాత్రం ప్లేఆఫ్స్ అవకాశాలు సంక్లిష్టంగా మారతాయి. ప్రధాన బ్యాటర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, నితీశ్ రెడ్డి, హెన్రిస్ క్లాసెన్‌లు బ్యాట్లు ఝళిపించకపోతే విజయం కష్టమే. మరోవైపు బౌలర్లు కమిన్స్, షమీ, హర్షల్ పటేల్, సిమర్‌జీత్ సింగ్, రాణించడం అత్యంత కీలకం.
Also Read: SRH Vs GT: ఉప్పల్‌లో గుజరాత్‌తో సన్‌రైజర్స్ ఢీ.. బ్యాట్లు ఝళిపించకపోతే అంతే..!
ఎస్‌ఆర్‌హెచ్ మ్యాచ్ నేపథ్యంలో సహాయక కోచ్ సైమన్ హెల్మోట్ మాట్లాడుతూ… ‘మా జట్టు ప్రణాళికలు ఎప్పుడూ ఒకేలా ఉంటాయి. సొంత మైదానంలో మేం సక్సెస్ అయ్యాం. ఉప్పల్ మైదానంలో గత ఎనిమిది మ్యాచుల్లో ఆరు గెలిచాం. చివరి రెండు మ్యాచ్‌లలో మాత్రం కలిసిరాలేదు. పాజిటివ్ క్రికెట్ ఆడతాం. మా ఆటపై మాకు నమ్మకం ఉంది. మాకు మంచి సారథి ఉన్నాడు, తప్పకుండా జట్టును ముందుకు తీసుకెళ్తాడు. మైదానంలో ప్రతిసారి ఒత్తిడి ఉండటం సహజం. గతంలో విజయం సాధించినా, ఓడినా దానిని పక్కన పెట్టేయాలి. ప్రస్తుతం మ్యాచ్‌పై దృష్టి పెట్టాలి. అభిషేక్, ట్రావిస్ హెడ్ దూకుడుకు మా మద్దతు ఉంటుంది. హైదరాబాద్‌లో అడుగు పెట్టినప్పటి నుంచి మంచి శకునాలే ఉన్నట్లు అనిపిస్తోంది’ అని చెప్పారు.