ఐపీఎల్ 2025లో భాగంగా గురువారం ముంబై ఇండియన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. సన్‌రైజర్స్ కీపర్ హెన్రీచ్ క్లాసెన్ అత్యుత్సాహం కారణంగా ముంబై ఓపెనర్ ర్యాన్ రికెల్టన్ డగౌట్ చేరి మరీ.. మరలా మైదానంలోకి వచ్చి ఆడాడు. క్లాసెన్ గ్లవ్స్ స్టంప్స్ ముందుకు తీసుకురావడంతో థర్డ్ అంపైర్ నోబాల్‌గా ప్రకటించాడు. దాంతో జీషన్ అన్సారి బౌలింగ్‌లో క్యాచ్ అవుట్ అయిన రికెల్‌టన్‌కు అవకాశం దొరికింది. దీనిపై కోల్‌కతా నైట్ రైడర్స్ మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి స్పందించాడు.
Also Read: Anaya Bangar: ఓ క్రికెటర్ నాతో పడుకుంటావా అన్నాడు.. సంజయ్ బంగర్ కుమార్తె షాకింగ్ కామెంట్స్!
కీపర్ గ్లవ్స్ స్టంప్స్ ముందుకొస్తే బౌలర్ పొరపాటు ఏముంది? అని, దీనిపై అందరూ ఆలోచించాలని వరుణ్ చక్రవర్తి తన సోషల్ మీడియాలో పోస్టు పెట్టాడు. ‘ఒకవేళ వికెట్ కీపర్ గ్లవ్స్ స్టంప్స్ ముందుకొస్తే దానిని డెడ్ బాల్‌గా ప్రకటించాలి. కీపర్‌కు వార్నింగ్ ఇస్తూ.. మరోసారి ఇలా చేయకూడదని చెప్పాలి. బంతిని నో బాల్‌గా ప్రకటించడం, ఫ్రీహిట్ ఇవ్వడం సరైంది కాదు. ఇందులో బౌలర్ పొరపాటు ఏముంది. దీని గురించి నేను తీవ్రంగా ఆలోచిస్తున్నా. అందరూ ఆలోచించాలని కోరుకుంటున్నా’ అని వరుణ్ చక్రవర్తి పేర్కొన్నాడు. మిస్టరీ స్పిన్నర్‌కు చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు. ఎంసీసీ 27.3 కోడ్ ప్రకారం.. బంతి స్టంప్స్‌ను దాటేవరకూ వికెట్ కీపర్ చేతులు వెనకనే ఉండాలి.