టీమిండియా మాజీ క్రికెటర్, మాజీ కోచ్ సంజయ్ బంగర్ కుమారుడు ఆర్యన్ బంగర్ అమ్మాయిగా మారిన విషయం తెలిసిందే. 24 ఏళ్ల ఆర్యన్.. హార్మోన్ రీప్లేస్‌మెంట్ థెరపీ తీసుకుని ‘అనయ బంగర్’గా మారారు. ప్రస్తుతం లండన్‌లో ఉంటున్న అనయ.. మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యారు. గతంలో తాను అబ్బాయి నుండి అమ్మాయిగా ఎలా మారాడో చెప్పిన అనయ.. తాజాగా తన కొత్త ప్రయాణం ఆరంభంలో ఎలాంటి ఇబ్బందులు పడాల్సి వచ్చిందో చెప్పారు.
తాజాగా లల్లాంటాప్‌లో సౌరభ్ ద్వివేదితో అనయ బంగర్ మాట్లాడారు. సౌరభ్ అడిగిన ప్రశ్నలకు అనయ సమాధానాలు ఇచ్చారు. మీ విషయం తెలిశాక సహచర క్రికెటర్లు ఎలా స్పందించారు? అని అడగగా… ‘ట్రాన్స్ మహిళలను చాలా చిన్నచూపు చూస్తారు. మేము కూడా మనుషులమే, మాకు సమాన గౌరవం ఇవ్వాలని కోరుకుంటున్నాను. నా విషయం తెలిసినపుడు కొందరు మద్దతుగా నిలిచారు. మరికొందరు మాత్రం వేధింపులకు గురిచేశారు. కొందరు క్రికెటర్లు అసభ్యకరమైన ఫొటోలు పంపేవారు. నాకు న్యూడ్ ఫొటోలు పంపి వేధించేవారు. చాలా అసౌకర్యంగా ఫీల్ అయ్యాను. అదే సమయంలో నిరాశకు కూడా గురయ్యా’ అని చెప్పారు.
‘ఒకరు అందరి ముందు మద్దతుగా మాట్లాడేవాడు. ఎవరూ లేనప్పుడు తన పక్కనే కూర్చోమని నా ఫొటోలు పంపమని అడిగేవాడు. ఓ ఓల్డ్ క్రికెటర్‌కు నా పరిస్థితి గురించి చెప్పా. అతను వెంటనే కారులో వెళ్దామని చెప్పి.. నాతో పడుకుంటావా అని అడిగాడు. ఆ వ్యక్తి నాతో అలాంటి మాటలు అన్నందుకు చాలా ఆశ్చర్యపోయాను. అంతేకాదు చాలా భయపడ్డాను. తొలి నాళ్లలో చాలా ఇబ్బందులు పడ్డాను’ అని అనయ బంగర్ తెలిపారు. ఆర్యన్ బంగర్‌గా దేశవాళీలో ఆడిన అనుభవం ఉంది. తండ్రి సంజయ్ బంగర్ మాదిరిగా అనయ కూడా క్రికెటర్ కావాలని భావించినా.. ఐసీసీ రూల్స్ అందుకు విరుద్ధంగా ఉన్నాయి. ట్రాన్స్‌జెండర్లకు అంతర్జాతీయ స్థాయిలో మహిళా క్రికెట్ ఆడే వీలు లేదని 2023లో ఐసీసీ నిర్ణయం తీసుకుంది. సంజయ్ బంగర్ భారత్ తరఫున 12 టెస్టులు, 15 వన్డేలు ఆడారు.