స్కోరు బోర్డుపై సరిపడా పరుగులు చేయకపోవడమే తమ ఓటమికి కారణం అని సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) కెప్టెన్ ఎంఎస్ ధోనీ తెలిపాడు. గత మ్యాచ్‌లలో రెండో ఇన్నింగ్స్‌లో తడబడ్డామని, ఈ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లోనే దారుణంగా విఫలమయ్యామన్నాడు. ఇతరులను అనుకరిస్తూ.. వారి లాగానే ఆడాలనుకోవడం సరికాదన్నాడు. పరిధులు దాటి హిట్టింగ్ మాత్రమే చేయాలనే దృక్పథం తమకు లేదని, అది చేతకాదు కూడా అని మహీ చెప్పుకొచ్చాడు. ఐపీఎల్ 2025లో భాగంగా శుక్రవారం చెపాక్ వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై దారుణ ఓటమిని ఎదుర్కొంది.
మ్యాచ్ అనంతరం ప్రెస్ కాన్ఫరెన్స్‌లో సీఎస్‌కే కెప్టెన్ ఎంఎస్ ధోనీ మాట్లాడుతూ… ‘గత కొన్ని రోజులుగా మాకు ఏదీ కలిసిరావడం లేదు. మా ముందు ఎన్నో సవాళ్లున్నాయి, వాటిని ఎదుర్కొనేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటాం. మేము స్కోరు బోర్డుపై సరిపడా పరుగులు చేయలేదనేది వాస్తవం. రెండో ఇన్నింగ్స్‌లో బంతి కాస్త నెమ్మదిస్తుందని భావించాం కానీ.. తొలి ఇన్నింగ్స్ నుంచి బ్యాటింగ్‌కు కష్టంగా మారింది. త్వరగా వికెట్లు కోల్పోయినప్పుడు ఒత్తిడి ఉంటుంది. అందులోనూ నాణ్యమైన స్పిన్నర్లు కలిగిన జట్టును అడ్డుకోవడం తేలికేం కాదు. మేం సరైన భాగస్వామ్యాలు నమోదు చేయలేదు’ అని తెలిపాడు.
Also Read: MS Dhoni: ఎంఎస్ ధోనీ అరుదైన రికార్డు.. ఐపీఎల్ హిస్టరీలోనే మొదటి ఆటగాడు!
‘పవర్ ప్లేలో 31 పరుగులు మాత్రమే చేశాం. అయితే పరిస్థితులకు తగ్గట్లుగా ఆడటానికే మేం ప్రాధాన్యం ఇస్తాం. గత రెండు మ్యాచ్‌లలో బాగానే ఆడాం. ఇతరులను అనుకరిస్తూ.. వారి లాగానే ఆడాలనుకోవడం సరికాదు. పవర్‌ప్లేలో 60 పరుగులు చేయాలనే ఆత్రుత ఒత్తిడిని పెంచుతుంది. మా ఓపెనర్లు మంచి బ్యాటర్లే. నాణ్యమైన క్రికెట్ షాట్లు ఆడే సామర్థ్యం వారికి ఉంది. ఇతర ఆటగాళ్లతో పోల్చడం సరైంది కాదు. హిట్టింగ్ మాత్రమే ఆడాలనే దృక్పథం మాకు లేదు, అది మాకు చేతకాదు. ఆరంభంలో త్వరగా వికెట్లను కోల్పోతే మిడిలార్డర్ బాధ్యత తీసుకోవాలి. మంచి భాగస్వామ్యాలను నమోదు చేయాలి. ఆ విషయంలో మాత్రం మేం వెనకబడ్డాం’ అని ఎంఎస్ ధోనీ చెప్పుకొచ్చాడు.