నంద్యాల జిల్లా బండి ఆత్మకూరులో విషాదం చోటుచేసుకుంది. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించలేదనే మనస్తాపంతో ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన శనివారం చోటుచేసుకుంది. స్థానిక ప్రభుత్వ కాలేజీలో చదువుతున్న చిన్న మస్తాన్ అనే విద్యార్థి ఇంటర్ ఫలితాల్లో ఫెయిలయ్యాడు. ఫలితాలు వెలువడిన అనంతరం తీవ్ర మనోవేదనకు గురైన చిన్న మస్తాన్ తన నివాసంలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. అతని తండ్రి పెద్ద మస్తాన్ స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ పాఠశాలలో ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. పిల్లాడి మృతి వార్తతో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. బంధువులు, స్నేహితులు శోకసంద్రంలో మునిగిపోయారు. సమాచారం అందుకున్న బండి ఆత్మకూరు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించి కేసు నమోదు చేశారు.
READ MORE: Amit Shah: ప్రతీ భారతీయుడికి ఛత్రపతి శివాజీ గురించి బోధించాలి..
ధైర్యంతో ఉండండి..
చదువంటే ఉద్యోగం తెచ్చిపెట్టే సాధనం మాత్రమే. జీవితంలో ఎదిగి ఉన్నతంగా జీవించి కుటుంబసభ్యులను మంచిగా చూసుకునేందుకు విద్య ఉపయోగపడుతుంది. అయితే చదువు లేకుండా కూడా ఎంతో మంది ఉన్నత శిఖరాలకు చేరుకుని ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతలు గడించారు. నచ్చిన రంగాల్లో అడుగుపెట్టి తమను వెక్కిరించిన వారిని సైతం తలదించుకునేలా చేశారు. పరీక్షల్లో ఫెయిల్ అయ్యామనో, అనుకునన్ని మార్కులు రాలేదనో జీవితాన్నే బలితీసుకోవాల్సిన అవసరం లేదు. చదువు అనేది జీవితంలో ఓ భాగం మాత్రమే. అందులో సక్సెస్ అవ్వకపోయినంత మాత్రాన జీవితమే వృథాగా భావించాల్సిన అవసరం లేదు. కష్టపడి చదివి మళ్లీ విజయం సాధించడమో లేదా నచ్చిన రంగం వైపు మళ్లడమో చేయాలి. అంతేకాని పరీక్షల్లో తప్పామని, నలుగురు ఏమనుకుంటారో అని ఆత్మనూన్యతా భావానికి గురికావొద్దు. నిండు ప్రాణాన్ని బలితీకోవద్దు. గోడకు కొట్టిన బంతిలా బలంగా తిరిగొచ్చి నువ్వేంటో చూపించాలి.