Amit Shah: ఛత్రపతి శివాజీ మహారాజ్ గురించి ప్రతీ భారతీయుడికి బోధించాలని, ప్రతీ తల్లి తన బిడ్డకు చెప్పాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా శనివారం అన్నారు. ప్రతీ భారతీయుడికి మాతృభూమికి సేవ చేయడం, సుపరిపాలనలో ఆదర్శవంతమైన మరాఠా సామ్రాజ్య స్థాపకుడి గురించి చెప్పాలని కోరారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ వర్ధంతి సందర్భంగా కేంద్ర మంత్రి షా మాట్లాడుతూ.. శివాజీ మహరాజ్‌ని మహారాష్ట్రకే పరిమితం చేయవద్దని, ఆయన నుంచి దేశం, ప్రపంచం ప్రేరణ పొందుతుందని చెప్పారు.
Read Also: Allahabad High Court: అరెస్ట్‌కి కారణం తెలియజేయకపోవడం, బెయిల్ ఇవ్వడానికి కారణం అవుతుంది..
రాజమాత జిజియా బాయి యువ శివాజీ మనసులో మంచి విలువలను నింపారని, స్వరాజ్యం, స్వధర్మం, భాషను పునరుద్ధరించడానికి ఆమె ప్రేరణనిచ్చిందని అమిత్ షా అన్నారు. చిన్నతనంలోనే మొత్తం దేశాన్ని ఏకం చేసి విముక్తి చేయాలనే ఆలోచనను ఆమె శివాజీకి ఇచ్చిందని, జిజౌ మా సాహెబ్ కూడా హిందవి స్వరాజ్యాన్ని స్థాపించడానికి శివాజీ మహారాజ్‌కి ప్రేరణగా నిలిచిందని చెప్పారు. భారతదేశంలో ప్రతీ బిడ్డ కూడా ఛత్రపతి చరిత్రను తెలుసుకోవాలని, వారికి తెలియజేయడం మనందరి బాధ్యత అని చెప్పారు.
‘‘12 ఏళ్ల బాలుడు సింధు నుండి కన్యాకుమారి వరకు కాషాయ జెండాను ఎగురవేస్తానని ప్రమాణం చేశాడు. నేను చాలా మంది వీరుల జీవిత చరిత్రలను చదివాను, కానీ అజేయమైన సంకల్ప శక్తి, గొప్ప వ్యూహం, ఈ వ్యూహాన్ని విజయవంతం చేయడానికి సమాజంలోని ప్రజలందరినీ ఏకం చేయడం ద్వారా, మరాఠాలు అపజయం లేని సైన్యాన్ని నిర్మించారు. వారు మొఘల్ సామ్రాజ్యాన్ని నాశనం చేశారు. వారి పోరాటం ఫలితంగా దేశం రక్షించబడింది, భాష రక్షించబడింది. స్వాతంత్ర్యం తర్వాత, మనం ప్రపంచంలోనే ఉన్నతంగా నిలుస్తున్నాం’’ అని అమిత్ షా అన్నారు. నేడు హిందవి స్వరాజ్ కోసం బలమైన సంకల్పం ఏర్పడిందని, భారతదేశం స్వాతంత్య్రం వచ్చి 100 ఏళ్లు పూర్తి చేసుకునే సమయానికి ప్రపంచంలోనే తొలిస్థానలో ఉంటామని ఆయన అన్నారు.