NTV Telugu Site icon

Tweets War in AP: రెండు రాష్ట్రాల సీఎంల భేటీపై ట్వీట్స్ వార్..

Tweets

Tweets

కాసేపట్లో హైదరాబాద్ ప్రజాభవన్ వేదికగా ఏపీ-తెలంగాణ ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు. ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న విభజన సమస్యల పరిష్కారంతో పాటు పలు ఇతర అంశాలపైనా ఇద్దరు సీఎంలు దృష్టి సారిస్తారు. ఇద్దరూ సీఎంలు అయ్యాక తొలిసారి భేటీ కానుండటంతో ఈ సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది. కాగా.. ఈ భేటీపై మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. పోర్టుల్లో, టీటీడీ ఆస్తుల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వాటాలు కోరుతున్నట్టుగా వస్తున్న వార్తలు ఏపీ ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయని అన్నారు. అంతే కాదు పారదర్శకతకోసం, ప్రజలకు వాస్తవాలు తెలియడానికి ముఖ్యమంత్రుల సమావేశాన్ని ప్రత్యక్షప్రసారం చేయాలన్నారు. ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకోవాలని బొత్స సత్యనారాయణ ట్విట్టర్ లో కోరారు.

Read Also: AI Pharma Hub : సంగారెడ్డిలో ఏఐ ఆధారిత ఫార్మా హబ్ ద్వారా 50,000 ఉద్యోగాలు

బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలకు మంత్రి అచ్చెన్నాయుడు కౌంటర్ ఇచ్చారు. ‘భలే జోకులేస్తున్నారు బొత్స గారు..! పారదర్శకత గురించి మీరు.. జగన్ మాట్లాడితే నవ్విపోతారు.. వద్దులెండీ..?’ అంటూ ట్వీట్ చేశారు. అలాగే పారదర్శకతకు పాతరేసిందే మీరు.. మీ పార్టీ. ప్రెస్ మీట్లు కూడా లైవ్ కాకుండా ఎడిట్ చేసి ఇవ్వాలని ఆదేశించే నాయకత్వంలో మీరు పని చేస్తున్నారని సెటైర్లు వేశారు. దయచేసి పారదర్శకత.. వాస్తవాలు వంటి పెద్ద పెద్ద పదాలు మీరు వాడొద్దని బొత్సకు సూచించారు. ప్రస్తుతం ఏపీ సేఫ్ హ్యాండ్స్ లో ఉందని.. డోంట్ వర్రీ. ప్రజలకు అన్ని విషయాలు తెలుసన్నారు. ఇద్దరు సీఎలు సమావేశమయ్యాక అన్నీ తెలుస్తాయని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.

 

Read Also: Anant ambani wedding: టీ 20 వరల్డ్ కప్ విజేతలకు అంబానీ ఫ్యామిలీ ఘన సన్మానం

మరోవైపు.. తెలుగు రాష్ట్రాల సీఎంల సమావేశంపై మాజీ మంత్రి పేర్ని నాని ఆసక్తికర ట్వీట్ చేశారు. ‘తెలుగు న్యూస్ ఛానళ్ళ బ్రేకింగ్ వార్తలు చూస్తున్నా.. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో ఇద్దరి డిమాండ్లు తీరాలంటే ఒకే మార్గం అన్నట్టుంది. రెండు రాష్ట్రాల పునరేకీకరణయే ఏకైక మార్గంగా కనపడుతుంది’. అని తెలిపారు.