NTV Telugu Site icon

CM Chandrababu: ప్రత్యేకంగా సీటు వేయాలా?.. కలెక్టర్ల కాన్ఫరెన్సులో ఆసక్తికర సంభాషణ

Ap Cm Chandrababu

Ap Cm Chandrababu

CM Chandrababu: వెలగపూడిలోని సచివాలయంలో కలెక్టర్ల సదస్సు కొనసాగుతోంది. వివిధ సంక్షేమ శాఖలపై ఆయా శాఖల అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. సివిల్ సప్లైస్ శాఖ సమీక్ష ప్రారంభించే ముందు కలెక్టర్ల కాన్ఫరెన్సులో ఆసక్తికర సంభాషణ జరిగింది. చాలా దూరంగా కూర్చున్నావ్.. ప్రత్యేకంగా సీటు వేయాలా..? అంటూ ఆ శాఖ కార్యదర్శి సిద్దార్ధ్ జైన్‌ను ఉద్దేశించి సీఎం చంద్రబాబు కామెంట్ చేశారు. నాన్ ఫోకస్‌లో ఉన్నానని అనుకుంటున్నారా..? అంటూ సీఎం చంద్రబాబు ఛలోక్తి విసిరారు. దగ్గరలో ఛైర్ లేకపోవడం వల్ల దూరంగా కూర్చున్నారంటూ సిద్దార్ధ్ జైన్‌కు సపోర్టుగా మంత్రి నాదెండ్ల మనోహర్‌ మాట్లాడారు. ఏం కాదులే.. మీరు మీ శాఖ అధికారిని వెనకేసుకొస్తున్నారంటూ సీఎం చంద్రబాబు సరదాగా వ్యాఖ్యానించారు. ఈ సంభాషణతో కలెక్టర్ల కాన్ఫరెన్స్ ఆహ్లాదంగా మారింది. అంతకు ముందు భోజన విరామం అనంతరం విద్యాశాఖపై ఆ శాఖ కార్యదర్శి కోన శశిధర్‌ పవర్‌ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. పోస్ట్ లంచ్ సమావేశం కాబట్టి వీలైనంత త్వరగా ముగిస్తానని కోన శశిధర్ వెల్లడించగా.. ఎవ్వరికీ నిద్ర రాకుండా ప్రజెంటేషన్ ఇవ్వాలని ఏపీ సీఎం చంద్రబాబు సరదాగా వ్యాఖ్యానించారు. దీంతో సమావేశంలోని అధికారుల ముఖాల్లో చిరునవ్వులు విరిశాయి.

Read Also: AP CM Chandrababu: ఏపీ యువతకు ఉద్యోగాలు లభించేలా నైపుణ్యాభివృద్ధి పెంచాలి..

కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ.. ఈ నెల ఏడో తేదీన చేనేత దినోత్సవం నిర్వహిస్తామని ప్రకటించారు. ఈ సందర్భంగా చేనేత జౌళి శాఖ కార్యదర్శి సునీత కల్పించుకుని విజయవాడలో నిర్వహించాలని కోరారు. ఈ క్రమంలో మీకు చీరాల రావడానికి ఏమైనా ఇబ్బందా.. అంటూ సీఎం చంద్రబాబు ఆ ఐఏఎస్‌ అధికారిని అడిగారు. ఈ సందర్భంగా అధికారి సునీత మాట్లాడుతూ.. అదే రోజున కేబినెట్ ఉందని చెప్పారు. ఆ తర్వాత సీఎం చంద్రబాబు స్పందిస్తూ..అయితే చేనేత దినోత్సవాన్ని చీరాలలోనే మధ్యాహ్నం కొనసాగించాలని ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లో చేనేత దినోత్సవాన్ని నిర్వహిస్తే మంచి ప్రభావం ఉంటుందని సీఎం స్పష్టం చేశారు. ఈ క్రమంలో తప్పకుండా చీరాలలో విజయవంతంగా చేనేత దినోత్సవాన్ని నిర్వహిస్తామని ఐఏఎస్ అధికారి సునీత ముఖ్యమంత్రికి తెలిపారు.

 

Show comments