Insists Husband For Seperate Family: పెళ్లి అనే బంధంతో ఓ ఆడ పిల్ల తన పుట్టింటిని వదిలి అత్తింటిలో అడుగుపెడుతుంది. భర్తతో కలిసి మెట్టినింట్లో అడుగుపెట్టిన ఆ అమ్మాయి తన అత్తమామలనే అమ్మా నాన్నలు అనుకోవాలి. అప్పుడే ఆ ఇల్లు ఆనందంగా ఉంటుంది. అత్త మామను శత్రువుల్లా చూస్తూ భర్త మాత్రమే చాలు.. నాకు ఎవరు అవసరం లేదు అనుకుంటే ఆ ఇంట్లో వారు ఎంత మంచిగా ఉన్నా వేరు కాపురం కావాలనే అనిపిస్తుంది. అయితే అటువంటి సందర్భాల్లో కన్న వారిని వదలలేక, కట్టుకున్న దానికి సర్ధి చెప్పలేక ఆ భర్త సతమతమవుతుంటాడు. మానసికంగా కుంగిపోతూ ఉంటాడు. కొత్తమంది భార్యలైతే వేరు కాపురానికి ఒప్పుకోకపోవడంతో ఏకంగా పెళ్లైన కొత్తలోనే భర్తను దూరం పెడుతున్నారు. అలాగైనా భర్తను తమ దారిలోకి తెచ్చుకోవాలనుకుంటున్నారు. అయితే వేరు కాపురం కోసం భర్తను దూరం పెట్టిన ఓ భార్యకు కోర్టు షాకిచ్చింది. ఈ తీర్పు అత్తామామల నుంచి భర్తను దూరం చేయాలనుకునే ప్రతి భార్యకు ఒక గుణపాఠంలా ఉంది.
వివరాల్లోకి వెళ్తే.. 2002 లో ఓ జంటకు వివాహమయ్యింది. వారికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే భార్య తన అత్తమామలతో కాకుండా వేరు కాపురం పెడదామని భర్తను తరచూ వేధించేది.అయితే ఆ భర్త మాత్రం తల్లిదండ్రులను వదిలేసి వచ్చే ప్రసక్తేలేదని ఆమెకు తెగేసి చెప్పాడు. దీంతో ఆమె తన అత్తామామలు తనను అదనపు కట్నం కోసం వేధిస్తున్నారని ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించింది. దీంతో విచారణ చేపట్టిన ఫ్యామిలీ కోర్టు స్థానిక పోలీసులను సంప్రదించగా ఆమె గురించి విస్తుపోయే నిజాలు తెలిశాయి. ఆమె అనేక సార్లు తన భర్త కుటుంబంపై ఫిర్యాదు చేసిందని, ఒకసారి తన అత్తింటి వారు అదనపు కట్నం కోసం వేధించారని కోర్టుకు తెలిపిన ఆమె మరొకసారి తన మామ తనపై అత్యాచారం చేయబోయడానికి ఫిర్యాదు చేసిందని స్థానిక పోలీసులు కోర్టుకు సమాచారం ఇచ్చారు. అయితే వీటిని ఆ మహిళ నిరూపించలేకపోవడంతో ఫ్యామిలీ కోర్టు ఈ కేసును కొట్టివేసింది. ఇక భార్య వేధింపులు తట్టుకోలేక ఆ భర్త 2007 లో అంటే పదహారేళ్ల క్రితం తనకు విడాకులు ఇవ్వాలంటూ కోర్టును ఆశ్రయించాడు. వాదనలు విన్న ఢిల్లీ హైకోర్టు ఆ భార్యకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. విదేశాల్లో లాగా భారతదేశంలో మేజర్ కాగానే లేదా పెళ్లికాగానే తల్లిదండ్రులను విడిచే సంస్కృతి లేదని పేర్కొంది. అది హిందూ సంప్రదాయానికి విరుద్ధం. అంతేకాకుండా వృద్ధాప్యంలో వారిని విడిచి వెళ్లడం నైతికంగా, చట్టపరంగా కూడా న్యాయం కాదని కోర్టు పేర్కొంది. అంతేకాకుండా కొడుకుకు కొన్ని బాధ్యతలు ఉంటాయి. వాటిని నెరవేర్చాల్సిందే అని ధర్మాసనం పేర్కొంది. ఇక తల్లిదండ్రులకు దూరంగా వేరు కాపురం పెట్టాలని భర్తను వేధించడం మానసిక క్రూరత్వం కిందకు వస్తుందని వాదనలు విన్న స్టిస్ సురేశ్ కుమార్ కైట్, జస్టిస్ నీనా బన్సల్ కృష్ణలతో కూడిన ధర్మాసనం తీర్పును ఇచ్చింది. అటువంటి భార్యకు విడాకులు ఇవ్వొచ్చని పేర్కొన్న కోర్టు ఆ భర్తకు విడాకులు మంజూరు చేసింది. వేరు కాపురం పెట్టాలనుకున్న భార్యలకు ఇది ఒక గుణపాఠం అని ఈ తీర్పు విన్నవారు అభిప్రాయపడుతున్నారు.