CNG Price: దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతుండటంలో పలువురు సీఎన్‌జీ వాహనాలను వాడుతున్నారు. ఈ నేపథ్యంలో సీఎన్‌జీ ధరను మరోమారు పెంచుతున్నట్లు ఇంద్రప్రస్త గ్యాస్ లిమిటెడ్(ఐజీఎల్) ప్రకటించింది. ముడిసరకు ధరలు పెరగడం కారణంగా సీఎన్‌జీ ధరలను పెంచినట్టు వివరించింది. పెంచిన ధరలు శనివారం నుంచే అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది. తాజా పెంపుతో ఢిల్లీలో కేజీ సీఎన్‌జీ ధర రూ.79.56కి చేరింది.
Read Also: Man Wakes Up From Dead: నోట్లో పాలు పోశారు.. శవం లేచి కూర్చుంది
అటు నోయిడా, గ్రేటర్ నోయిడా, ఘాజియాబాద్లో కేజీ సీఎన్‌జీ ధర రూ.82.12కి పెరిగింది. గురుగ్రామ్లో కేజీ సీఎన్‌జీ ధర రూ. 87.89గా ఉంది. తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే హైదరాబాద్లో కేజీ సీఎన్‌జీ ధర ప్రస్తుతం రూ.95గా ఉంది. నెల రోజుల వ్యవధిలో ఈ ధర రూ. 3 పెరిగింది. దీపావళి పండుగకు ముందు అక్టోబర్‌లో సీఎన్‌జీ ధరలను పెంచారు. కాగా గ్యాస్ ధరలతో పాటు ఇప్పుడు సీఎన్‌జీ ధరలు కూడా పెరగడంతో సర్వత్రా ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. సీఎన్‌జీ ధరల పెంపుతో ఓలా, ఉబర్ క్యాబ్ సర్వీసు ప్రొవైడర్లు ప్రయాణికుల నుంచి అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నారు. ఆటో ప్రయాణికులపై కూడా శనివారం నుంచి అదనపు ఛార్జీల భారం పడనుంది.