Himachal Pradesh polls: ప్రస్తుతం తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు కూడా బద్ధకిస్తున్న అక్షరాస్యులున్నారు. అలాంటిది 106ఏళ్ల వయసులో కూడా ఓటేసి తనకు సమాజం పట్ల ఉన్న బాధ్యతను తెలియజేస్తున్నారు శ్యామ్ శరణ్ నేగి. అతను హిమాచల్ ప్రదేశ్‌లోని కల్పాలో రిటైర్డ్ పాఠశాల ఉపాధ్యాయుడు. భారతదేశంలో 1951 సాధారణ ఎన్నికల్లో మొదటి ఓటు వేశాడు. హిమాచల్ ప్రదేశ్‌లో, స్వతంత్ర భారతదేశంలోని మొదటి ఓటరు. గిరిజన జిల్లా కిన్నౌర్‌కు చెందిన 106 ఏళ్ల మాస్టర్ శ్యామ్ శరణ్ నేగి 14వ విధానసభ ఎన్నికలకు పోస్టల్ బ్యాలెట్ ద్వారా 34వ సారి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. రాష్ట్రంలోని 80 ఏళ్లు పైబడిన వృద్ధులు, దివ్యాంగులకు ఇంటి నుంచే బ్యాలెట్ పేపర్ ద్వారా ఓటు వేసే ప్రక్రియ ప్రారంభమైందని AIR ప్రతినిధి తెలిపారు.
Read Also: K. A. Paul: నేను బిజీ నావద్దకు రావద్దు…సెల్ఫీలు దిగొద్దు ప్లీజ్
శ్యాం శరణ్ నేగి లోక్‌సభ ఎన్నికలలో పదహారు సార్లు ఓటు వేశారు. అతను 2014 నుంచి రాష్ట్ర ఎన్నికల చిహ్నంగా కూడా ఉన్నాడు. శ్యామ్ శరణ్ నేగి తన జీవితంలో మొదటిసారి తన ఇంటి నుండి ఓటు వేశారు. శరణ్ నేగి గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. జిల్లా యంత్రాంగం కల్పాలోని ఆయన ఇంటి వద్ద రెడ్ కార్పెట్ ఏర్పాటు చేసింది. అందుకే ఆయన ఓటును నమోదు చేసుకోవడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్టు కిన్నౌర్ డిప్యూటీ కమిషనర్ అబిద్ హుస్సేన్ తెలిపారు. తన తండ్రి 1951లో ఓటు వేసి మొదటి ఓటరు అయ్యారని శ్యామ్ శరణ్ నేగి చిన్న కుమారుడు చందన్ ప్రకాష్ తెలిపారు. ఇప్పటికీ ఎన్నికల ప్రక్రియకు సహకరిస్తూ ప్రజల్లో స్ఫూర్తిని నింపుతున్నారని తెలిపారు. ఈ వయస్సులో కూడా ఓటు వేయడం ద్వారా పౌరుడిగా తన కర్తవ్యాన్ని కొనసాగిస్తున్నారని అన్నారు. నేగి హిమాచల్ ప్రదేశ్ కు జరిగిన ప్రతీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేశారు.