Site icon NTV Telugu

Rupee Value: రూపాయి మరింత పతనం.. ఒక డాలర్‌కు ఎన్ని రూపాయలంటే..?

Rupee Value

Rupee Value

Rupee Value: అమెరికా కరెన్సీ డాలర్‌తో పోలిస్తే ఇండియన్ కరెన్సీ రూపాయి విలువ రోజురోజుకు దిగజారుతోంది. చమురు ధరలు, ట్రెజరీ ఈల్డ్స్ పెరుగుదల, విదేశీ సంస్థాగత నిధుల ఉపసంహరణ, యూఎస్ కరెన్సీకి డిమాండ్ పెరుగుదల వంటి అంశాలు రూపాయి పతనానికి కారణమవుతున్నాయని బిజినెస్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. సోమవారం నాడు రూపాయి విలువ 82.33 నుంచి 82.66కు పడిపోయింది. అటు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన డాలరు నిల్వలను ఖర్చు చేస్తూ రూపాయి పతనం కాకుండా జోక్యం చేసుకుంటున్నా పెద్దగా ఫలితాన్ని ఇవ్వడం లేదు. ఇప్పటికే పెద్ద ఎత్తున డాలర్ నిల్వలు ఆవిరివడంతో ఇక ఆచితూచి వ్యవహరిస్తోంది. ఈ కారణంగా ఇతర కరెన్సీల తరహాలోనే రూపాయి కూడా భారీ పతనాన్ని చవిచూస్తోంది.

Read Also: Andhra Pradesh: ఏపీ విద్యాశాఖలో తొలిసారి ప్రపంచ బ్యాంక్ ప్రాజెక్టు

అటు చమురు ఉత్పాదక దేశాల మండలి ఒపెక్‌ క్రూడ్‌ ఉత్పత్తిలో కోత విధించడంతో అంతర్జాతీయ మార్కెట్లో ఈ ఇంధనం బ్యారల్‌ ధర 95 డాలర్ల స్థాయిని దాటడం, అమెరికా బాండ్‌ ఈల్డ్‌ పెరగడం తదితర అంశాలు రూపాయిని పడగొట్టాయని ఫారెక్స్‌ ట్రేడర్లు అభిప్రాయపడుతున్నారు. చమురు ధరలు పెరుగుతూ ఉంటే స్వల్పకాలంలోనే రూపాయి 85 స్థాయికి పతనం అయ్యే అవకాశాలున్నాయని చెప్తున్నారు. రానున్న ట్రేడింగ్‌ సెషన్లలో రూపాయి మారకపు విలువ 83 స్థాయికి పడిపోవచ్చని అంటున్నారు. కాగా రూపాయి పతనం సామాన్యులపైనా ప్రభావం చూపుతోంది. విదేశీ ప్రయాణాలు, విదేశాల్లో చదువులు ప్రియం అవుతున్నాయి. మనం దిగుమతి చేసుకునే పెట్రోల్, డీజిల్ భారం అవుతుండటంతో నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్నాయి.

Exit mobile version