Railway Ticket Discounts: ప్రపంచంలోనే భారతీయ రైల్వే నాలుగో అతిపెద్ద రైల్వే నెట్‌వర్క్. దేశంలోని చాలావరకు ప్రాంతాలను ప్రజలను అత్యంత సురక్షితంగా, తక్కువ ఖర్చుతో ప్రయాణించే అవకాశం కల్పిస్తోంది భారతీయ రైల్వే (Indian Railways). ఇక భారతీయ రైల్వే ప్రయాణికులకు అనేక రకాల సౌకర్యాలను అందిస్తోంది. ముఖ్యంగా, కొన్ని ప్రత్యేక వర్గాల ప్రయాణికులకు 75% వరకు టికెట్ రాయితీని అందిస్తోంది. ఈ రాయితీ ఒకసారి మాత్రమే కాకుండా అవసరమైన ప్రతిసారి వర్తిస్తుంది. మరి ఈ రాయితీల గురించి పూర్తి వివరాలను ఒకసారి చూద్దామా..
Read Also: Flight Break Fail: తృటిలో పెను ప్రమాదం తప్పించుకున్న డిప్యూటీ సీఎం..
భారతీయ రైల్వే ప్రత్యేక వర్గాల ప్రయాణికులకు జనరల్ క్లాస్, స్లీపర్, 3AC టికెట్‌లపై 75% వరకు రాయితీ లభిస్తోంది. ఈ వర్గాల్లో ప్రధానంగా ఇతరుల సహాయం లేకుండా ప్రయాణించలేని ప్రయాణికులకు మాత్రమే కాకుండా.. వారికి సహాయంగా వెళ్లే వ్యక్తికి కూడా రాయితీ లభిస్తుంది. మానసిక పరిస్థితి సరిగా లేనివారు, అంధులు, శారీరక దివ్యాంగులకు 75% వరకు రాయితీ ఉంటుంది. ఇక్కడ ఇంకో విశేషమేమిటంటే.. సహాయకుడిగా వెళ్లే వ్యక్తికి కూడా అదే రాయితీ లభిస్తుంది. ఇక భారతీయ రైల్వేస్ లో పేరొందిన శతాబ్దీ, రాజధాని వంటి ప్రత్యేక రైళ్లలో 3AC, AC చెయిర్ కార్ కోచ్‌లకు 25% వరకు రాయితీ లభిస్తుంది. అలాగే ఇతర ఎక్స్‌ప్రెస్ రైళ్లలో కూడా 1AC, 2AC క్లాస్‌లకు 50% వరకు రాయితీ లభిస్తుంది.
భారతీయ రైల్వే నిబంధనల ప్రకారం పూర్తిగా వినకుండా, మాట్లాడకుండా ఉండే ప్రయాణికులకు 50% రాయితీ లభిస్తుంది. వీరికి తోడుగా ప్రయాణించే వ్యక్తికి కూడా అదే రాయితీ వర్తిస్తుంది. అలాగే క్యాన్సర్, కిడ్నీ సంబంధిత వ్యాధులు, టిబి, గుండె సంబంధిత వ్యాధులు, హీమోఫీలియా, ఎయిడ్స్, ఆస్టోమీ వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో బాధపడే రోగులకు భారతీయ రైల్వే 50% నుంచి 75% వరకు రాయితీ అందిస్తుంది. ఈ రాయితీ పొందాలంటే ప్రభుత్వ ఆసుపత్రి నుండి ధృవీకరణ పత్రాన్ని సమర్పించాల్సి ఉంటుంది.
వీరితో పాటు పాఠశాలలు, కళాశాలలు విద్యార్థులకు ఎడ్యుకేషనల్ టూర్ నిర్వహిస్తే వారికి కూడా 50% నుంచి 75% వరకు రాయితీ అందిస్తున్నారు. ఈ రాయితీ మీకు వర్తిస్తుందో లేదో తెలుసుకోవాలంటే భారతీయ రైల్వే అధికారిక వెబ్‌సైట్ https://www.indianrail.gov.in/ వెళ్లి తనిఖీ చేసుకోవచ్చు. అక్కడ టికెట్ బుకింగ్ సమయంలో ఈ రాయితీ కోసం ఎలా దరఖాస్తు చేయాలో వెబ్‌సైట్‌లో స్పష్టంగా తెలుపబడింది.