Vande Bharat Trains for IND vs PAK Match: భారత గడ్డపై గురువారం వన్డే ప్రపంచకప్ 2023 ఆరంభం అయింది. మెగా టోర్నీ మొదటి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్‌ను న్యూజిలాండ్ చిత్తు చిత్తుగా ఓడించింది. నేడు హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో పాకిస్థాన్, నెదర్లాండ్స్ జట్లు తలపడుతున్నాయి. భారత్ అక్టోబర్ 8న భారత్ తన తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాను ఢీ కొడుతుంది. ఇక అక్టోబర్ 14న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్, పాకిస్థాన్‌లు తలపడనున్నాయి. చిరకాల ప్రత్యర్థుల మధ్య మ్యాచ్‌ను చూసేందుకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
భారత్, పాకిస్థాన్ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు భారీ సంఖ్యలో అహ్మదాబాద్‌కు అభిమానులు రానున్నారు. ఈ క్రమంలో అహ్మదాబాద్, పరిసర ప్రాంతాల హోటళ్లకు డిమాండ్ భారీగా పెరిగింది. మరోవైపు మ్యాచ్ జరిగే రోజు పలు నగరాల నుంచి అహ్మదాబాద్‌కు వెళ్లే విమాన టికెట్ రేట్స్ సైతం ఎక్కువగానే ఉన్నాయి. దాంతో అభిమానుల జేబులకు చిల్లులు పడడం ఖాయం. ఈ క్రమంలోనే క్రికెట్ అభిమానులకు భారతీయ రైల్వే ఓ శుభవార్త చెప్పింది.
Also Read: PAK vs NED: టాస్ గెలిచిన నెదర్లాండ్స్.. తెలుగులో మాట్లాడిన డచ్ ప్లేయర్!
భారత్, పాకిస్థాన్ మ్యాచ్ జరిగే రోజున అహ్మదాబాద్‌కు ప్రత్యేక వందే భారత్ రైళ్లను నడపనున్నట్లు భారతీయ రైల్వే తెలిపింది. రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రల నుంచి అహ్మదాబాద్‌కు ప్రత్యేక రైళ్లు వెళ్లనున్నాయి. త్వరలోనే షెడ్యూల్, టికెట్ ధరల వివరాలు వెల్లడిస్తామని రైల్వే అధికారులు చెప్పారు. అహ్మదాబాద్‌లోని హోటళ్ల ధరలు భారీగా పెరగడం, పెరిగిన విమాన టికెట్ ధరల వంటి వాటి నుంచి అభిమానులకు ఉపశమనం కలిగించేందుకు వందే భారత్ ప్రత్యేక సర్వీసులను నడపాలని నిర్ణయించినట్లు రైల్వే ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.