Indian Racing league: హైదరాబాద్‌లో జరుగుతున్న ఇండియన్ రేసింగ్ లీగ్ ఫైనల్ ముగిసింది. ఆదివారం చిరుజల్లుల మధ్యనే రయ్ మంటూ రేసింగ్ కార్లు దూసుకెళ్లాయి. ఇండియన్ రేసింగ్ ఫైనల్‌లో కొచ్చి టీం విజేతగా నిలిచింది. ఈ రేసులో ‘గాడ్ స్పీడ్ కొచ్చి’ టీమ్ 417.5 పాయింట్లతో మొదటిస్థానాన్ని కైవసం చేసుకుంది. ఇక 385 పాయింట్లతో బ్లాక్ బర్డ్స్ హైదరాబాద్ టీమ్ రెండో స్థానంలో నిలిచింది. మూడో స్థానంలో గోవా (282 పాయింట్లు), నాలుగో స్థానంలో చెన్నై (279 పాయింట్లు), ఐదో స్థానంలో బెంగళూరు (147.5 పాయింట్లు), ఆరో స్థానంలో ఢిల్లీ (141 పాయింట్లు) జట్లు నిలిచాయి. ఈసారి రేసింగ్ లో ఆరు టీమ్స్, 12 కార్లు, 24 మంది డ్రైవర్స్ పాల్గొన్నారు. ఈ పోటీలో 250 నుంచి 300 కిలోమీటర్ల స్పీడ్ తో స్పోర్ట్స్ కార్లు దూసుకుపోయాయి.
Read Also: Mandous Cyclone : కర్ణాటకలో మాండూస్ ఎఫెక్ట్.. బెంగళూరుకు ఎల్లో అలర్ట్
తొలిరోజు శనివారం రేసింగ్ నిర్వహణలో గందరగోళం నెలకొంది. హైదరాబాద్ స్ట్రీట్ సర్క్యూట్‌పై కేవలం ఒకే ఒక్క ప్రాక్టీస్ రేసు మాత్రమే జరిగింది. దీంతో క్వాలిఫైయింగ్ పోటీలు జరపకుండా రెండు ప్రాక్టీస్ సెషన్స్ మాత్రమే నిర్వహించారు. ఇవాళ ఉదయం 9గంటలకే ఇండియన్ రేసింగ్ లీగ్ పోటీలు ప్రారంభమయ్యాయి. ఉదయం షెడ్యూల్ ప్రకారం రేసింగ్ పోటీలు ప్రారంభమయ్యాయి. తొలుత శనివారం రద్దయిన రేస్‌ల నిర్వహణ కొనసాగింది. తొలి 30 నిమిషాలకు సంబంధించి రేస్ పూర్తయింది. క్వాలీఫైయింగ్-1, క్వాలిఫైయింగ్ -2 పోటీలను నిర్వహించారు. తొలుత వర్షం కారణంగా పోటీలకు ఆటంకం కలిగినప్పటికీ.. వర్షం ఆగిపోవటంతో అన్ని పోటీలను పూర్తిచేసేలా నిర్వాహకులు చర్యలు చేపట్టారు.