NTV Telugu Site icon

Vivek Taneja: వాషింగ్ట‌న్‌లో దాడి.. మృతిచెందిన భారత సంతతి వ్యాపారవేత్త!

Vivek Taneja

Vivek Taneja

అమెరికాలో భారతీయ విద్యార్థులు, భారత సంతతికి చెందిన వారిపై వరుసగా దాడులు జరగడం, కొందరు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర కలకలం రేపుతోంది. తాజాగా అలాంటిదే మరో ఘటన చోటుచేసుకుంది. వీధి గొడవలో గుర్తు తెలియని వ్యక్తి చేతిలో భారత సంతతికి చెందిన ఓ వ్యాపారవేత్త మృతి చెందారు. ఈ ఘటన ఫిబ్ర‌వ‌రి 2న జరగ్గా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దాడి చేసిన నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అధికారులు వెల్లడించిన వివరాల ఇలా ఉన్నాయి.

వివేక్‌ తనేజా (41) ‘డైనమో టెక్నాలజీస్‌’ సహ వ్యవస్థాపకుడు. ఈ కంపెనీ అమెరికా ప్రభుత్వానికి సాంకేతిక సహకారం అందిస్తోంది. వర్జీనియాలో నివాసముంటున్న వివేక్‌.. ఫిబ్రవరి 2న ఓ రెస్టారెంట్‌కు వెళ్లాడు. అర్థరాత్రి 2 గంటల సమయంలో బయటకు వచ్చాడు. వీధిలో నడుచుకుంటూ వెళుతుండగా.. గుర్తు తెలియని వ్యక్తితో వివేక్‌కు గొడవ జరిగింది. ఆ గొడవ పెద్దది కాగా.. దుండగుడు వివేక్‌పై దాడి చేశాడు. ఆపై వివేక్‌ను కిందపడేసి నెలకు కొట్టాడు. తలకు తీవ్ర గాయం కావడంతో వివేక్‌ అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఆయనను ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ వివేక్‌ బుధవారం ప్రాణాలు కోల్పోయాడు.

Also Read: Virat Kohli: విరాట్ కోహ్లీ నిర్ణయాన్ని గౌరవిస్తాం: బీసీసీఐ

వివేక్‌ తనేజా మృతిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుడి కోసం గాలింపులు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజ్‌ ఆధారంగా నిందితుడి ఫొటోను విడుదల చేసి.. ఆచూకీ చెప్పిన వారికి 25 వేల డాలర్ల రివార్డును ప్రకటించారు. తాజాగా అమెరికాలో ఉన్నత విద్య కోసం వెళ్లిన హైదరాబాద్‌కు చెందిన సయ్యద్ మజాహిర్‌ అలీపై గుర్తు తెలియని దుండగులు చికాగోలో దాడి చేశారు. ఈ ఏడాది ఇప్ప‌టివ‌ర‌కు అమెరికాలో ఉంటున్న ఐదుగురు భార‌తీయ విద్యార్థులు పలు దాడుల్లో ప్రాణాలు కోల్పోయారు.