ICC Rankings: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) తాజాగా విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో భారత ఆటగాళ్లు మరోసారి తమ ప్రతిభను చాటారు. ముఖ్యంగా టీ20, వన్డే ర్యాంకింగ్స్‌లో భారత బ్యాటర్లు, బౌలర్లు అగ్రస్థానాలను సాధించారు. టీ20 బ్యాటింగ్ విభాగంలో టాప్-10లో భారత బ్యాటర్లు ముగ్గురు నిలిచారు. ఇందులో యువ ఆటగాడు అభిషేక్ శర్మ 829 పాయింట్లతో రెండో స్థానాన్ని దక్కించుకోగా, తిలక్ వర్మ 804 పాయింట్లతో నాలుగో స్థానం, సూర్యకుమార్ యాదవ్ 739 పాయింట్లతో ఐదో స్థానంలో కొనసాగుతున్నారు. ఈ విభాగంలో ఆస్ట్రేలియా బ్యాటర్ ట్రావిస్ హెడ్ 856 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.
Read Also: Poonam Gupta: ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్‌గా పూనమ్ గుప్తా! ఆమె ఎవరంటే..!
ఆల్‌రౌండర్ల విభాగంలో భారత స్టార్ ఆటగాడు హార్దిక్ పాండ్య 252 పాయింట్లతో మొదటి స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. అయితే టాప్-10లో మరో భారత ఆటగాడు ఉండకపోవడం గమనార్హం. ఆ తర్వాత అక్షర్ పటేల్ 161 పాయింట్లతో 12వ స్థానంలో నిలిచాడు. బౌలింగ్ విభాగంలో భారత బౌలర్లు అగ్రస్థానాల్లో నిలిచారు. వరుణ్ చక్రవర్తి 706 పాయింట్లతో మూడో స్థానం, రవి బిష్ణోయ్ 674 పాయింట్లతో ఏడో స్థానం, అర్షదీప్ సింగ్ 653 పాయింట్లతో 10వ ర్యాంక్‌లో నిలిచారు.
ఇక వన్డేల్లో భారత స్టార్ బ్యాటర్ శుభ్‌మన్ గిల్ 784 పాయింట్లతో అగ్రస్థానాన్ని కొనసాగిస్తున్నాడు. పాకిస్థాన్ బ్యాటర్ బాబర్ అజామ్ 777 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. భారత కెప్టెన్ రోహిత్ శర్మ 756 పాయింట్లతో మూడో స్థానం, విరాట్ కోహ్లీ 736 పాయింట్లతో ఐదో స్థానంలో నిలిచారు. శ్రేయస్ అయ్యర్ 704 పాయింట్లతో ఎనిమిదో ర్యాంక్ లో కొనసాగుతున్నాడు. బౌలింగ్ విభాగంలో భారత బౌలర్ కుల్దీప్ యాదవ్ ఒక స్థానం మెరుగుపర్చుకుని 650 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచాడు. రవీంద్ర జడేజా 616 పాయింట్లతో 9వ ర్యాంక్‌ను దక్కించుకున్నాడు. ఆల్‌రౌండర్ల విభాగంలో జడేజా 10వ స్థానాన్ని దక్కించుకున్నాడు.