ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్‌గా పూనమ్ గుప్తా నియమితులయ్యారు. ఏప్రిల్ 7-9 తేదీల్లో జరగనున్న కీలకమైన ద్రవ్య విధాన కమిటీ సమావేశానికి ముందే పూనమ్ గుప్తా డిప్యూటీ గవర్నర్ బాధ్యతలు చేపట్టనున్నారు. మూడు సంవత్సరాల కాలానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) డిప్యూటీ గవర్నర్‌గా కేంద్రం నియమించింది. జనవరిలో పదవీ విరమణ చేసిన మైఖేల్ పాత్ర స్థానంలో పూనమ్ గుప్తా బాధ్యతలు చేపట్టనున్నారు.
పూనమ్ గుప్తా ఎవరు?
పూనమ్ గుప్తా.. ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి సభ్యురాలుగా కూడా ఉన్నారు. తాజాగా ఆమె నియామకాన్ని క్యాబినెట్ నియామకాల కమిటీ ఆమోదించింది. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లైడ్ ఎకనామిక్ రీసెర్చ్ (NCAER)కు కూడా ఆమె నాయకత్వం వహించారు. అంతేకాకుండా ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్‌లో గ్లోబల్ మాక్రో అండ్ మార్కెట్ రీసెర్చ్‌కు లీడ్ ఎకనామిస్ట్‌గా పనిచేశారు. ఇక ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో ప్రొఫెసర్‌గా పనిచేశారు. అలాగే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ (IMF)లో పరిశోధకురాలిగా ఉన్నారు. ప్రస్తుతం 16వ ఆర్థిక సంఘం సలహా మండలిలో సభ్యురాలిగా ఉన్నారు.
విద్యా నేపథ్యం..
యూనివర్శిటీ ఆఫ్ మేరీల్యాండ్.. 1995 సంవత్సరంలో ఆర్థిక శాస్త్రంలో మాస్టర్ డిగ్రీ చేశారు. అనంతరం 1998లో ఇన్ ఎకనామిక్స్‌లో పీహెచ్‌డీ చేశారు. ఇక 1991లో ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో ఎంఏ చదివారు. అలాగే 1989లో హిందూ కాలేజ్, ఢిల్లీ యూనివర్సిటీలో బీఏ. ఇన్ ఎకనామిక్స్ పూర్తి చేశారు. ఇక 1998లో అంతర్జాతీయ ఆర్థిక శాస్త్రంలో పీహెచ్‌డీ చేసినందుకు ఎక్సిమ్ బ్యాంక్ అవార్డును గెలుచుకున్నారు.