NTV Telugu Site icon

IND vs SL: శ్రీలంక 170 ఆలౌట్‌.. తొలి టీ-20లో భారత్‌ ఘన విజయం

India

India

IND vs SL: కొత్త కోచ్‌-కెప్టెన్‌ ద్వయం సూర్యకుమార్‌ యాదవ్‌, గౌతమ్‌ గంభీర్‌ నేతృత్వంలో భారత్‌ విజయభేరీ మోగించింది. మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా శ్రీలంకతో జరిగిన తొలి మ్యాచ్‌లో టీమిండియా 43 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 26 బంతుల్లో 58 పరుగులతో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ విధ్వంసక ఇన్నింగ్స్‌తో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 213 పరుగుల భారీ స్కోరు సాధించింది. జవాబుగా, శ్రీలంక పూర్తి శక్తితో పోరాడింది. అయితే చివరి ఓవర్లలో దాని బ్యాట్స్‌మెన్ ఒత్తిడిని తట్టుకోలేక 19.2 ఓవర్లలో 170 పరుగులకు ఆలౌటైంది. శ్రీలంక ఓపెనర్లు పాతుమ్ నిస్సాంక(79), కుశాల్ మెండిస్(45) దూకుడుతో ఆ జట్టు ఓ దశలో విజయం వైపు దూసుకెళ్లింది. కానీ వీరిద్దరూ ఔటయ్యాక మిడిలార్డర్ కుప్పకూలడంతో మ్యాచ్‌ భారత్‌ వైపు తిరిగింది. తొలి మ్యాచ్‌లో భారత్ విజయం సాధించి.. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది. భారత బౌలర్లలో రియాన్‌ పరాగ్‌ 3 వికెట్లు తీయగా.. అర్షదీప్, అక్షర్‌ తలో రెండు వికెట్లు పడగొట్టారు. సిరాజ్, రవి బిష్ణోయ్ తలో వికెట్‌ పడగొట్టారు.

Read Also: WhatsApp: భారతదేశంలో వాట్సాప్ సేవలు నిలిచిపోతాయా..? కేంద్రం కీలక ప్రకటన..

తొలుత టాస్‌ గెలిచి శ్రీలంక బౌలింగ్ ఎంచుకోగా.. భారత్‌ బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి భారత్‌ 213 పరుగులు చేసింది. ఓపెనర్లు యశస్వి జైస్వాల్ (40), శుభ్‌మన్ గిల్ (34) శుభారంభం అందించగా.. తర్వాత వచ్చిన సూర్యకుమార్ యాదవ్ (58), రిషభ్ పంత్ (49) కూడా దంచికొట్టారు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ జోడీ కూడా దూకుడుగా ఆడుతూ స్కోరుబోర్డును పరుగులు తీయించింది. సూర్యకుమార్ 26 బంతుల్లో 8 ఫోర్లు, సిక్సులతో 58 పరుగులు చేశాడు. పంత్ కూడా ధాటిగా ఆడుతూ 33 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్సుతో 49 పరుగులు చేశాడు. సూర్యకుమార్, పంత్, హార్దిక్ పాండ్యా (9), రియాన్ పరాగ్ (7) పతిరణ బౌలింగ్ లోనే అవుటయ్యారు. శ్రీలంక బౌలర్లలో పతిరణ 4, అసిత ఫెర్నాండో, దిల్షాన్ మధుశంక, హసరంగ తలో వికెట్ పడగొట్టారు.