U19 World Cup Winner: ఐసీసీ అండర్-19 పురుషుల వరల్డ్ కప్ 2026 ఫైనల్ లో భారత్ అద్భుత విజయాన్ని నమోదు చేసి ఆరోవసారి ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచింది. హరారేలో జరిగిన ఈ ఫైనల్ లో ఇంగ్లాండ్ అండర్-19 జట్టుపై భారత్ 100 పరుగుల భారీ తేడాతో గెలిచి టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఈ విజయంతో భారత్ అండర్-19 వరల్డ్ కప్‌ను ఆరోసారి గెలుచుకుని తన ఆధిపత్యాన్ని మరోసారి నిరూపించింది.
ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 411 పరుగులు చేసి భారీ స్కోర్ నమోదు చేసింది. భారత ఇన్నింగ్స్‌లో వైభవ్ సూర్యవంశీ అద్భుత సెంచరీతో మ్యాచ్‌ను వన్ సైడ్ చేసేశాడు. కేవలం 80 బంతుల్లో 175 పరుగులు చేసి ఇంగ్లాండ్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. అతని ఇన్నింగ్స్‌లో 15 ఫోర్లు, 15 సిక్సర్లు ఉన్నాయి. కెప్టెన్ ఆయుష్ మత్రే 53 పరుగులు, అభిగ్యాన్ కుందు 40 పరుగులతో మంచి సహకారం అందించారు. చివర్లో కనిష్క్ చౌహాన్ వేగంగా 37 పరుగులు చేసి స్కోర్‌ను 400 దాటించాడు.
భారీ లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్ జట్టు ప్రారంభంలో పోరాడినా.. భారత బౌలర్ల ముందు నిలవలేకపోయింది. కేలబ్ ఫాల్కనర్ 115 పరుగులతో శతకం సాధించి పోరాడినా మిగతా బ్యాటర్లు పెద్దగా రాణించలేదు. చివరకు ఇంగ్లాండ్ 40.2 ఓవర్లలో 311 పరుగులకు ఆలౌట్ అయింది. భారత్ బౌలింగ్‌లో ఆర్.ఎస్. అంబ్రిష్ 3 వికెట్లు, దీపేష్ దేవేంద్రన్ 2 వికెట్లు, కనిష్క్ చౌహాన్ 2 వికెట్లు తీసి జట్టుకు విజయాన్ని అందించారు.
