Site icon NTV Telugu

India vs UAE: తొలి మ్యాచ్‌లో భారత్ రికార్డు విజయం.. రప్ఫాడించిన బౌలర్లు..

Ind Uae

Ind Uae

టీ20 ఆసియా కప్ 2025లో భారత్ శుభారంభం చేసింది. తొలి మ్యాచ్‌లో యూఏఈపై భారత్‌ రికార్డు విజయం సాధించింది.. యూఏఈపై భారత్ 9 వికెట్ల తేడాతో గెలిచింది. ప్రత్యర్థి జట్టు యూఏఈ కేవలం 58 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించగా.. భారత్ బ్యాటర్లు కేవలం 4.3 ఓవర్లలోనే మ్యాచ్‌ను ముగించారు. ఇన్నింగ్స్ మొదటి బంతికి సిక్సర్ బాదిన అభిషేక్ శర్మ, ఆ తర్వాతి బంతికి ఫోర్ బాదాడు. మొదటి ఓవర్‌లో 10 పరుగులు వచ్చాయి. రెండో ఓవర్‌లో శుభ్‌మన్ గిల్ 4, 6 బాదడంతో 15 పరుగులు వచ్చాయి. మూడో ఓవర్‌లో అభిషేక్ శర్మ 6, 4 బాదాడు. 16 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 30 పరుగులు చేసిన అభిషేక్ శర్మ, జునైద్ సిద్ధిఖీ బౌలింగ్‌లో భారీ షాట్‌కి ప్రయత్నించి అవుట్ అయ్యాడు. సూర్యకుమార్ యాదవ్ రాగానే సిక్సర్ బాదాడు. ఆ తర్వాతి ఓవర్‌లో శుభ్‌మన్ గిల్ ఫోర్ బాది మ్యాచ్‌ని ముగించాడు.

READ MORE: PM Modi: ఇజ్రాయిల్ దాడిని ఖండించిన మోడీ, ఖతార్ ఎమిర్‌‌కు ఫోన్ కాల్..

టాస్‌ ఓడిపోయి తొలుత బ్యాటింగ్‌కు దిగిన యూఏఈ జట్టు 13.1 ఓవర్లలో 57 పరుగులకు కుప్పకూలింది. టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో యూఏఈకి ఇది అత్యల్ప స్కోరు. ఈ మ్యాచ్‌లో స్పిన్నర్ కుల్దీప్ యాదవ్, ఆల్ రౌండర్ శివమ్ దూబే విధ్వంసం సృష్టించారు. కుల్దీప్ 2.1 ఓవర్లలో 7 పరుగులకు నాలుగు వికెట్లు పడగొట్టారు. శివమ్ 2 ఓవర్లలో నాలుగు పరుగులు ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టారు. జస్ప్రీత్ బుమ్రా, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి ఒక్కొక్క వికెట్ తీసుకున్నారు.

READ MORE: Nepal Palace Massacre: ప్రేమకు బలైన నేపాల్ రాజ కుటుంబం.. ప్యాలెస్‌లో ఊచకోత.. ఆ నాటి విషాద గాథ

మొదట బ్యాటింగ్ చేసిన యూఏఈ వికెట్ కోల్పోకుండా 26 పరుగులు చేసింది. అనంతరం భారత బౌలర్లు రెచ్చిపోయారు. దీంతో యూఏఈ కేవలం 31 పరుగులు చేసి 10 వికెట్లు కోల్పోయింది. ఆ జట్టు తరఫున అలీషాన్ షరాఫు (22) అత్యధిక స్కోరు సాధించాడు. కెప్టెన్ మహ్మద్ వసీం 19 పరుగులకే పరిమితమయ్యాడు. వికెట్ కీపర్ రాహుల్ చోప్రా (3), హర్షిత్ కౌశిక్ (2) సహా ఎనిమిది మంది ఆటగాళ్ళు రెండంకెల స్కోరును చేరుకోలేకపోయారు.

Exit mobile version