Site icon NTV Telugu

Asaduddin Owaisi: భారత్- పాకిస్థాన్ మ్యాచ్‌పై అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు..

Asaduddin Owaisi

Asaduddin Owaisi

Asaduddin Owaisi: ఆసియా కప్‌లో భాగంగా ఆదివారం రాత్రి జరగనున్న భారత్ vs పాకిస్థాన్ మ్యాచ్‌పై రాజకీయ, సామాజిక వివాదం ముదురుతోంది. పహల్గామ్ ఉగ్రవాద దాడిలో 26 మంది అమాయక పౌరులు మరణించిన నేపథ్యంలో ఈ మ్యాచ్‌ను బహిష్కరించాలని ప్రతిపక్షాలు, బాధిత కుటుంబాలు డిమాండ్ చేస్తున్నాయి. తాజాగా ఈ అంశంపై ఏఐఎంఐఎం చీఫ్, లోక్‌సభ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. ఓ మీడియా సంస్థతో ఒవైసీ మాట్లాడుతూ.. పహల్గాం దాడి తర్వాత పాక్‌తో మ్యాచ్‌ ఎలా ఆడుతారని ప్రశ్నించారు. మతాన్ని అడిగి మరీ 26 మందిని దారుణంగా కాల్చి చంపారని గుర్తు చేశారు.. రక్తం, నీరు కలిసి ప్రవహించలేవని చెప్పిన మోడీ మాటలను గుర్తు చేశారు.. క్రికెట్‌ మ్యాచ్‌ ఎలా జరుగుతుందో చెప్పాలని నిలదీశారు. 26 మంది పౌరుల ప్రాణాల కంటే డబ్బే ఎక్కువ విలువైందా? అని ప్రశ్నించారు. దీనికి కేంద్రంలోని బీజేపీ సమాధానం చెప్పాలని.. పాకిస్థాన్‌తో అన్ని సంబంధాలు తెంచుకున్నప్పుడు.. నీటి ఒప్పందాలు కూడా రద్దు చేసుకున్నప్పుడు మ్యాచ్‌ మాత్రం ఎందుకు ఆడుతున్నారన్నారు. పహల్గాం బాధితులకు మోడీ ఏం సమాధానం చెబుతారు? అని అడిగారు.

READ MORE: Social Media Reels Addiction: రీల్స్ ఎక్కువగా చూస్తున్నారా? అయితే ఈ సమస్యలు మీతోనే!

మరోవైపు.. ఇటీవల వరల్డ్ లెజెండ్స్​ ఛాంపియన్​షిప్ టోర్నమెంట్​లో టీమ్ఇండియా లెజెండ్స్ పాకిస్థాన్‌తో రెండుసార్లు మ్యాచ్‌ను బాయ్‌కాట్ చేశారు. దీంతో టీమ్ఇండియా టోర్నీ నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే ఆసియా కప్‌లోనూ పాక్‌తో మ్యాచ్‌ను టీమ్ఇండియా బాయ్‌కాట్ చేస్తుందని అనుకున్నారంతా. కానీ వరల్డ్ లెజెండ్స్​ ఛాంపియన్​షిప్ అనేది ఓ ప్రైవేటు ఈవెంట్, ఆసియా కప్ మాత్రం అలా కాదు. దీనిని ఆసియా క్రికెట్ కౌన్సిల్ నిర్వహిస్తుంది. దీంతో ఆసియా క్రికెట్ కౌన్సిల్ జూలైలో షెడ్యూల్ ప్రకటించేసింది. అయితే ఐసీసీ, ఏసీసీ నిబంధనల మేరకే పాక్‌తో భారత్ ఆడుతుందని బీసీసీఐ ఇప్పటికే స్పష్టం చేసింది. మల్టీనేషనల్ టోర్నీల్లో ఆడినప్పటికీ, ద్వైపాక్షిక సిరీస్‌లో నిషేధం కొనసాగుతుందని చెప్పింది.

Exit mobile version