India vs Pakistan: ఆసియా కప్ 2025లో భాగంగా సెప్టెంబర్ 14న దుబాయ్‌లో భారత్-పాకిస్థాన్ మ్యాచ్ జరగనుంది. షెడ్యూల్ ప్రకటించినప్పటి నుంచి ఈ మ్యాచ్ రద్దు చేయాలంటూ కొందరు డిమాండ్ చేస్తూనే ఉన్నారు. దేశంలోని క్రికెట్ అభిమానులు సైతం ఈ మ్యాచ్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడిలో 26 మంది అమాయకులు అమరులయ్యారు. అనంతరం భారత్ ఆపరేషన్ సిందూర్‌ను ప్రారంభించింది. శత్రుదేశం పాక్ కాల్పుల్లో మన దేశానికి చెందని 20 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. అమరవీరుల కుటుంబాల కళ్లు చెమ్మ ఆరలేదు. అంతలోనే శత్రువుతో మ్యాచ్ ఆడటం పట్ల ప్రజల్లో ఆగ్రహం వ్యక్తం కావడం సహజం. గతంలో ఉగ్రవాదం, వాణిజ్యం కలిసి సాగలేవని, రక్తం, నీరు కలిసి ప్రవహించలేవని ప్రధాన మంత్రి మోడీ చెప్పిన మాటలను నెటిజన్లు ఇప్పుడు గుర్తు చేస్తున్నారు. ఆ మాటలు ఏమయ్యాయని.. రక్తం, క్రికెట్ ఎలా కలిసి సాగగలవని ప్రభుత్వం, బీసీసీఐని సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు.
READ MORE: Akhilesh Yadav: ” ఇదే కొనసాగితే, భారత్‌లో నేపాల్ లాంటి పరిస్థితి” అఖిలేష్ యాదవ్ వార్నింగ్..
అంతే కాదు.. తాజా పరిస్థితుల్లో సెప్టెంబర్ 14న దుబాయ్‌లో జరగబోయే భారత్ – పాక్ ఆసియా కప్ మ్యాచ్‌ను రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. అయితే, న్యాయమూర్తులు జే.కే. మహేశ్వరి, విజయ్ బిష్ణోయి ఉన్న ధర్మాసనం ఆ పిటిషన్‌ను విచారించేందుకు కూడా నిరాకరించింది. దీంతో చాలా మంది నిరాశ వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు.. కాన్పూర్, మొరాదాబాద్ వంటి నగరాల్లో బీసీసీఐకి వ్యతిరేకంగా నిరసనలు జరిగాయి. పాకిస్థాన్ జెండాలను తగలబెట్టారు. #BoycottPakCricket, #PehalgamAttack వంటి హ్యాష్‌ట్యాగ్‌లు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. భారత క్రికెట్ అభిమానులు ఈ మ్యాచ్‌ను అమరవీరులకు అవమానంగా అభివర్ణిస్తున్నారు. ఈ అంశంపై భారత ప్రభుత్వం పట్టించుకోలేదని మండిపడుతున్నారు. సంజయ్ రౌత్ వంటి ప్రతిపక్ష నాయకులు సైతం ఈ మ్యాచ్ ను వ్యతిరేకిస్తున్నారు.