Site icon NTV Telugu

India – America: భారత్-అమెరికా మధ్య దోస్తి.. 10 ఏళ్లకు కుదిరిన రక్షణ ఒప్పందం

India America

India America

India – America: భారతదేశం – అమెరికా మధ్య 10 సంవత్సరాల రక్షణ ఒప్పందం కుదిరింది. మలేషియా రాజధాని కౌలాలంపూర్‌లో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో సమావేశమైన తర్వాత అమెరికా రక్షణ కార్యదర్శి పీట్ హెగ్సేత్ ఈ ఒప్పందాన్ని అధికారికంగా ప్రకటించారు. ఈ ఒప్పందం ద్వారా రెండు దేశాలు ఒకదానితో ఒకటి సమాచారాన్ని పంచుకోనున్నాయి. అలాగే ఇరు దేశాలు సాంకేతిక సహాయం కూడా అందించుకోనున్నాయి.

READ ALSO: 2025 బిలియనీర్ల ర్యాంకింగ్స్ – ఎవరి విలువ ఎంత ఉందో చూడండి!

పీట్ హెగ్సేత్ ఏమన్నారంటే..
రక్షణ ఒప్పందంపై పీట్ హెగ్సేత్ మాట్లాడుతూ.. “ఈ రకమైన ఒప్పందం ఇంతకు ముందు ఎన్నడూ జరగలేదు. మేము 10 సంవత్సరాల పాటు రక్షణ ఒప్పందంపై సంతకం చేసాము. ఈ నిర్ణయం రెండు దేశాల మధ్య సమన్వయాన్ని సృష్టించే ప్రయత్నం. ప్రాంతీయ స్థిరత్వాన్ని కొనసాగించడం, సైనిక సమన్వయాన్ని మరింతగా పెంచడం, రక్షణ సాంకేతిక సహకారాన్ని పెంపొందించడం ఈ ఒప్పందం ప్రాథమిక లక్ష్యం” అని అన్నారు.

అమెరికా – భారతదేశం మధ్య కుదిరిన ఈ రక్షణ ఒప్పందం ఇండో-పసిఫిక్ పై ప్రత్యక్ష ప్రభావాలను చూపుతుంది. ఈ ఒప్పందం ఇండో-పసిఫిక్ ప్రాంతంలో సైనిక సహకారం, ఉమ్మడి చొరవల కోసం దశాబ్ద కాలం పాటు సాగే రోడ్ మ్యాప్‌ను నిర్దేశిస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అమెరికా రక్షణ ఒప్పందం తర్వాత, రాజ్‌నాథ్ సింగ్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్ చేశారు. ఈ ఒప్పందాన్ని కొత్త శకానికి నాందిగా ఆయన అభివర్ణించారు. “ఈ రక్షణ ఒప్పంద రోడ్‌మ్యాప్ భారతదేశం-అమెరికా రక్షణ సంబంధాలకు దిశానిర్దేశం చేస్తుంది” అని ఆయన పేర్కొన్నారు. “ఇది ఇరుదేశాల మధ్య పెరుగుతున్న వ్యూహాత్మక కలయికకు సంకేతం” అని అన్నారు.

ఇండో – పసిఫిక్ ప్రాంతం ప్రపంచంలోనే అత్యంత జనాభా కలిగినది, అలాగే ఆర్థికంగా చురుకైన ప్రాంతాలలో ఒకటిగా విశ్లేషకులు చెబుతున్నారు. ఇండో-పసిఫిక్ ప్రాంతం నాలుగు ఖండాలను కలిగి ఉంది. ఆ ప్రాంతాలు.. ఆసియా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా, అమెరికా. ప్రపంచ జనాభాలో దాదాపు 60 శాతం మంది ఈ ప్రాంతంలో నివసిస్తున్నారు. భారతదేశం, చైనా, యునైటెడ్ స్టేట్స్ వంటి శక్తివంతమైన దేశాలు కూడా ఈ ప్రాంతంలోనే ఉన్నాయి. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో ఒకప్పుడు అమెరికా ఆధిపత్యం ఉండేది, కానీ చైనా దానిని తగ్గించింది. దీంతో ఇప్పుడు ఈ ప్రాంతంలో చైనా ఆధిపత్యం బలపడుతుందని ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలు భయపడుతున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

READ ALSO: Indonesia New Capital: దేశ రాజధానిని మారుస్తున్న అతిపెద్ద ముస్లిం దేశం.. ఏ భయంతోనో తెలుసా!

Exit mobile version