India’s Likely 17 member squad for Asia Cup 2023: ఆసియా కప్ 2023 ఆగస్టు 30 నుంచి ఆరంభం అవుతుంది. తొలి మ్యాచ్‌లో నేపాల్‌తో పాకిస్థాన్ తలపడనుంది. సెప్టెంబరు 2న చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో భారత్ తొలి మ్యాచ్ ఆడనుంది. ఈ టోర్నీలో 6 జట్లు పాల్గొంటుండగా పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్ టీమ్స్ ఇప్పటికే తమ జట్లను ప్రకటించాయి. భారత్ సహా శ్రీలంక, అఫ్గానిస్తాన్ జట్లు తమ టీమ్స్ ప్రకటించాల్సి ఉంది. సోమవారం (ఆగష్టు 21) బీసీసీఐ 17 మందితో కూడిన జట్టును ప్రకటిస్తుందని సమాచారం తెలుస్తోంది.
ఆసియా కప్ 2023కి భారత జట్టు ఎలా ఉంటుందో అని ఫాన్స్ ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే దాదాపుగా ఇదే జట్టు ప్రపంచకప్ 2023లో ఆడనుంది. బీసీసీఐ సెలెక్షన్ కమిటీ ఇప్పటికే ప్లేయర్ల విషయంలో ఓ నిర్ణయానికి వచ్చేసినట్లు సమాచారం. ఈ జట్టులో కీలక ప్లేయర్లను బీసీసీఐ పక్కన పెట్టేసిందట. సోమవారం జట్టు ప్రకటన ఉన్న నేపథ్యంలో స్పోర్ట్స్ అనలిస్ట్స్ తమ ఎక్స్ (ట్విట్టర్)లో జట్టును ప్రకటించారు. దాదాపుగా ఇదే జట్టును బీసీసీఐ ప్రకటించనుంది. ఆ జట్టు ఎదో ఓసారి చూద్దాం.
గాయపడి కోలుకున్న స్టార్ బ్యాటర్స్ కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ పూర్తి ఫిట్‌నెస్ సాధించారు. వీరిద్దరూ ఆసియా కప్ 2023 జట్టులో ఉన్నారు. వికెట్ కీపర్‌గా రాహుల్ వైపే బీసీసీఐ మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. టాపార్డర్‌లో లెఫ్ట్ హ్యాండర్ అవసరం అని భావించిన సెలెక్టర్లు తిలక్ వర్మకు అవకాశం ఇచ్చారు. ఇషాన్ కిషన్ జట్టులో చోటు దక్కించుకోగా.. సంజూ శాంసన్‌కు నిరాశే ఎదురైంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, శుభమాన్ గిల్ టాపార్డర్‌లో ఆడతారు.
ఆల్‌రౌండర్ కోటాలో హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దల్ ఠాకూర్ జట్టులో ఉన్నారు. స్పెషలిస్ట్ స్పిన్ కోటాలో కుల్దీప్ యాదవ్‌కు స్థానం ఖాయం కాగా.. మరో స్థానంలో యుజువేంద్ర చహల్ లేదా ఆర్ అశ్విన్ ఎంపికయ్యే అవకాశం ఉంది. ఇక పేస్ కోటాలో జస్ప్రీత్ బుమ్రా, మొహ్మద్ షమీ, మొహ్మద్ సిరాజ్ ఎంపికవనున్నారు.
ఆసియా కప్ 2023కి భారత జట్టు (Asia Cup India Squad 2023):
రోహిత్ శర్మ, శుభమాన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దల్ ఠాకూర్, యుజువేంద్ర చహల్/ఆర్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మొహ్మద్ షమీ, మొహ్మద్ సిరాజ్.