NTV Telugu Site icon

Ban Sugar Exports: పెరుగుతున్న ద్రవ్యోల్బణం.. అక్టోబర్ నుంచి చక్కెర ఎగుమతులపై నిషేధం!

Sugar Exports

Sugar Exports

Ban Sugar Exports: అత్యల్ప వర్షపాతం కారణంగా చెరకు దిగుబడి తగ్గిన కారణంగా అక్టోబర్‌లో ప్రారంభమయ్యే తదుపరి సీజన్‌లో చక్కెర ఎగుమతులను భారతదేశం నిషేధించవచ్చని తెలుస్తోంది. వర్షపాతం తగినంత లేకపోవడంతో ఈ సారి చెరకు దిగుబడి తగ్గనుండడంతో చెరకు ధరలకు రెక్కలు వస్తాయని సర్కారు అంచనా వేస్తోంది. మహారాష్ట్ర, కర్ణాటకలలో రుతుపవనాల వర్షాలు సగటు కంటే 50 శాతం వరకు తక్కువగా ఉండటంతో, అత్యధికంగా చెరకు ఉత్పత్తి చేసే ప్రాంతాలపై ప్రభావం చూపుతున్న వర్షాభావ పరిస్థితులను అనుసరించి ఈ ఊహించిన చర్య జరగనున్నట్లు సమాచారం.

Read Also: PM Modi on Chandrayaan-3: ఈ విజయం దేశం గర్వించే మహోన్నత ఘట్టం

ఏడేళ్ల త‌ర్వాత భార‌త్ చ‌క్కెర ఎగుమ‌తుల‌పై నిషేధం విధిస్తోంది. ఆహార ద్రవ్యోల్బణంపై భారతదేశం ఆందోళనలను ఎదుర్కొంటోంది. జులైలో రీటైల్ ద్రవ్యోల్బణం 15 నెలల గ‌రిష్ట స్థాయిలో 7.4 శాతానికి ఎగ‌బాక‌డం, ఆహార ద్రవ్యోల్బణం 11.5 శాతానికి చేర‌డంతో భార‌త్ చెర‌కు ఎగుమ‌తుల‌పై బ్యాన్ విధించే ప్రతిపాద‌న‌ను పరిశీలిస్తోంద‌ని చెబుతున్నారు.మూడేళ్ల గ‌రిష్టస్ధాయిలో ద్రవ్యోల్బణం పెర‌గ‌డంతో ఆహారోత్పత్తుల ధ‌ర‌ల‌కు చెక్ పెట్టేందుకు ఎగుమ‌తుల‌పై నిషేధం అనివార్యమ‌ని సర్కారు ఆలోచిస్తోంది. ఇక 2023-24 సీజ‌న్‌లో చెర‌కు దిగుబ‌డి 3.3 శాతం త‌గ్గి 31.7 మిలియ‌న్ ట‌న్నుల‌కు ప‌డిపోతుంద‌ని అంచ‌నా. గత సీజన్‌లో 11.1 మిలియన్ టన్నుల చక్కెరతో పోలిస్తే, ప్రస్తుత సీజన్‌లో 6.1 మిలియన్ టన్నుల చక్కెరను మాత్రమే ఎగుమతి చేయడానికి భారతదేశం మిల్లులను అనుమతించిన తర్వాత ఇది జరిగింది.

ఈ పరిణామాల మధ్య, భారతీయ అధికారులు స్థానిక చక్కెర అవసరాలకు, మిగులు చెరకు నుంచి ఇథనాల్ ఉత్పత్తికి ప్రాధాన్యతనిస్తున్నారు. ఆహార ద్రవ్యోల్బణంపై సంభావ్య ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని దేశంలో తగినంత సరఫరాలు, స్థిరమైన ధరలను నిర్ధారించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నేపథ్యంలో చక్కెర ఎగుమతులపై నిషేధం విధించనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల బాస్మతీయేతర తెల్ల బియ్యం ఎగుమతులపై నిషేధం, ఉల్లి ఎగుమతులపై 40 శాతం సుంకం విధించడం వంటి చర్యలకు పూనుకున్న భారత్ తాజాగా చక్కెర ఎగుమతులపై నిషేధం విధించనున్నట్లు తెలుస్తోంది. ఈ చర్యలు రాబోయే రాష్ట్రాల ఎన్నికలకు ముందు ఆహార ధరలను నిర్వహించడానికి విస్తృత ప్రయత్నాలలో భాగంగా ఉన్నాయి.