NTV Telugu Site icon

IND Playing 11 vs BAN: శార్దూల్, సిరాజ్ ఔట్.. బంగ్లాదేశ్‌తో బరిలోకి దిగే భారత్ తుది జట్టు ఇదే!

India New Team

India New Team

IND Playing 11 vs BAN: ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023లో హ్యాట్రిక్ విజయాలతో దూసుకుపోతున్న భారత్.. మరో సమరానికి సిద్ధమైంది. గురువారం (అక్టోబర్ 19) పూణెలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో బంగ్లాదేశ్‌తో రోహిత్ సేన తలపడనుంది. భారత్ మరో విజయంపై కన్నేయగా.. మెగా టోర్నీలో టీమిండియాకు మరోసారి షాక్ ఇవ్వాలని బంగ్లా చూస్తోంది. మ్యాచ్‌ నేపథ్యంలో టీమిండియా ప్లేయింగ్ ఎలెవెన్‌ను ఓసారి చూద్దాం.

డెంగ్యూ నుంచి కోలుకున్న తర్వాత జట్టులోకి తిరిగి వచ్చిన శుభ్‌మాన్ గిల్.. రోహిత్ శర్మతో కలిసి ఓపెనింగ్ చేయనున్నాడు. పాకిస్తాన్‌పై 16 పరుగులకే ఔట్ అయిన గిల్.. బంగ్లాదేశ్‌పై చెలరేగాలని టీమ్ మేనేజ్మెంట్ ఆశిస్తోంది. వరుస హాఫ్ సెంచరీలు చేసిన రోహిత్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ ఫామ్‌లోనే ఉన్నారు. ఇప్పటివరకు స్టార్ ఆల్‌రౌండర్‌లు హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజాలకు బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. పాండ్యా ఆస్ట్రేలియాపై 11 పరుగులు చేసి అజేయంగా నిలవగా.. జడేజా ఇంకా బ్యాటింగ్ చేయలేదు. జట్టును ఆదుకోవడానికి ఇద్దరు సిద్ధంగా ఉన్నారు.

భారత్ బౌలింగ్‌లో మార్పులు చేసే అవకాశం ఉంది. నాలుగు రోజుల్లో రెండు మ్యాచ్‌లు ఆడిన పేసర్లు జస్ప్రీత్ బుమ్రా, మొహ్మద్ సిరాజ్‌లలో ఒకరికి బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో విశ్రాంతినిచ్చే అవకాశాలు ఉన్నాయి. వెన్ను గాయంతో ఈ ఏడాది ఎక్కువగా మ్యాచ్‌లు ఆడని బుమ్రాను కొనసాగించి సిరాజ్‌కు రెస్ట్ ఇచ్చే ఛాన్స్ ఉంది. సిరాజ్ స్థానంలో సీనియర్ పేసర్ మొహ్మద్ షమీ జట్టులోకి వస్తాడు. ఇక ఆల్‌రౌండర్‌ శార్దూల్ ఠాకూర్ స్థానంలో వెటరన్ స్పిన్నర్ ఆర్ అశ్విన్ ఆడే అవకాశం ఉంది. మరో స్పిన్నర్ గా కుల్దీప్ యాదవ్ ఆడనున్నాడు.

Also Read: NED vs SA: దక్షిణాఫ్రికాపై నెదర్లాండ్స్‌ విజయం.. మూడేళ్ల క్రితం ట్వీట్ వైరల్‌!

భారత్ తుది జట్టు (అంచనా):
శుభ్‌మన్ గిల్, రోహిత్ శర్మ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా.