NTV Telugu Site icon

Chandrayaan-3: ఉద్విగ్న క్షణాల్లో భారతావని.. షెడ్యూల్‌ కంటే ముందే ల్యాండింగ్ ప్రక్రియ

Chandrayaan 3

Chandrayaan 3

Chandrayaan-3: చంద్రయాన్‌-3 చంద్రుడిపై అడుగుపెట్టేందుకు అంతా సిద్ధమైంది. జాబిల్లిపైకి మన వ్యోమనౌక చంద్రయాన్‌-3 అద్భుతమైన క్షణాల కోసం యావత్‌ భారతావని ఉత్కంఠతో ఎదురుచూస్తోంది. నెట్టింట ఆ ఉత్కంఠ కనిపిస్తోంది. చంద్రుడిపై ల్యాండర్‌ సురక్షితంగా దిగి, చరిత్ర సృష్టించాలని ప్రతీ ఒక భారతీయుడు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాడు. ఈ క్రమంలో ల్యాండర్‌ సురక్షితంగా దిగాలని ఆలయాల్లో హోమాలు, దర్గాల్లో ప్రార్థనలు చేస్తున్నారు. ఇప్పటివరకు అన్ని దశలను విజయవంతంగా పూర్తి చేస్తుకున్న వ్యోమనౌక దక్షిణ ధ్రువంపై ల్యాండింగ్‌కు ఉపక్రమిస్తోంది. ఇదిలా ఉండగా.. చంద్రయాన్‌-3 వ్యోమనౌక షెడ్యూల్‌ కంటే ముందే ల్యాండింగ్ కానుంది. ఈ సాయంత్రం 5.44 గంటలకు ల్యాండర్‌ మాడ్యూల్‌ నిర్దేశిత ప్రాంతానికి చేరుకోనుంది. ఈ విషయాన్ని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) వెల్లడించింది.

Read Also: Chandrayaan-3 Mission: అంతా సిద్దం.. చంద్రయాన్ 3 గురించి కీలక అప్డేట్ ఇచ్చిన ఇస్రో

” ఆటోమేటిక్‌ ల్యాండింగ్ సీక్వెన్స్‌(ఏఎల్‌ఎస్)ను ప్రారంభించేందుకు అంతా సిద్ధంగా ఉందని ఇస్రో ట్విట్టర్ వేదికగా తెలిపింది. “సాయంత్రం 5.44 గంటలకు ల్యాండర్‌ మాడ్యూల్‌ నిర్దేశిత ల్యాండింగ్‌ ప్రదేశానికి రానుంది. ఏఎల్‌ఎస్‌ కమాండ్‌ను స్వీకరించిన వెంటనే ల్యాండర్‌ మాడ్యూల్‌ థ్రాటల్‌బుల్‌ ఇంజిన్ల వేగాన్ని తగ్గించుకుంటూ ముందుకెళ్తుంది’’ అని ఇస్రో రాసుకొచ్చింది. ల్యాండింగ్‌ ప్రక్రియను సాయంత్రం 5.20 గంటల నుంచే ఇస్రో తమ వెబ్‌సైట్‌ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. సాయంత్రం 5.44 గంటల తర్వాత ల్యాండింగ్ ప్రక్రియ మొదలైన తర్వాత 17 నిమిషాల పాటు సాగే ప్రక్రియ సంక్లిష్టంగా ఉండనుంది. అందుకే దీన్ని ‘17 మినిట్స్‌ ఆఫ్‌ టెర్రర్‌’గా శాస్త్రవేత్తలు అభివర్ణిస్తున్నారు. గంటకు దాదాపు 6 వేల కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్న వ్యోమనౌక జోరుకు ఈ 17 నిమిషాల్లోనే కళ్లెం వేసి, చందమామ దక్షిణ ధ్రువంపై సురక్షితంగా దించాలి. దీన్ని సాఫ్ట్‌ ల్యాండింగ్‌ అంటారు. ల్యాండింగ్ పూర్తయిన తర్వాత వెంటనే వ్యోమనౌక కాళ్లలోని ‘టచ్‌డౌన్‌ సెన్సర్లు’.. ఆన్‌బోర్డ్‌ కంప్యూటర్‌కు మెసేజ్‌ను పంపుతాయి.

Read Also: Chandrayaan 3: చంద్రయాన్ 3 ల్యాండింగ్ కోసం ఎదురుచూస్తున్న సెలబ్రెటీలు, ట్విటర్ వేదికగా కోరుకున్న సౌత్ స్టార్స్

విక్రమ్ ల్యాండర్‌ సాఫ్ట్‌ ల్యాండింగ్ కావాలని దేశవ్యాప్తంగా పలు దేవాలయాల్లో పూజలు జరుగుతున్నాయి. యోగా గురువు రామ్‌దేవ్ బాబా హరిద్వార్‌లో హోమం చేశారు. రాజస్థాన్‌లోని అజ్మీర్ షరీఫ్ దర్గాలో ప్రార్థనలు జరిగాయి. దేశవ్యాప్తంగా విద్యార్థులు జాతీయ జెండాలు పట్టుకుని పాటలు పాడారు. అలాగే ల్యాండింగ్ ప్రక్రియ ప్రత్యక్ష ప్రసారం కోసం వారంతా ఎదురుచూస్తున్నారు. ప్రముఖ సైకత శిల్పి సదర్శన్‌ పట్నాయక్ తన కళతో చంద్రయాన్‌-3 విజయాన్ని కాంక్షించారు. చంద్రయాన్‌-3 ప్రయోగం విజయం సాధించాలంటూ సోషల్‌ మీడియాలో పోస్టులు వెల్లువెత్తాయి. ల్యాండర్‌ ల్యాండింగ్ అయిన తర్వాత రోవర్‌ బయటకు వస్తుంది. ల్యాండర్, రోవర్‌ 14 రోజుల పాటు చంద్రుడి ఉపరితలంపై పరిశోధనలు సాగించనున్నాయి.

Show comments