NTV Telugu Site icon

Fighter Jet Engines: ఫైటర్ జెట్ ఇంజిన్ల కోసం అమెరికా, ఫ్రాన్స్‌లతో భారత్ చర్చలు

Fighter Jet

Fighter Jet

Fighter Jet Engines: భారతదేశం రక్షణ రంగంలో ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళుతున్నప్పటికీ.. ఫ్రాన్స్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాతో భవిష్యత్ స్వదేశీ ఫైటర్ జెట్ ప్రాజెక్ట్‌ల కోసం ఇంజిన్‌ల తయారీపై భారత్ కీలక చర్చలు జరుపుతోంది. లైట్ కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ (LCA) ఎంకే2 తయారీకి వినియోగించే జనరల్ ఎలక్ట్రిక్ (GE) ఇంజిన్‌ల కోసం అమెరికాతో చర్చలు జరుగుతున్నాయి. అధునాతన మీడియం కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ (AMCA) కోసం హై-పవర్ ఇంజిన్ కోసం ఫ్రాన్స్‌తో చర్చలు జరుగుతున్నాయి. ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమం కింద భారత్‌లోనే భవిష్యత్ యుద్ధ విమానాలను తయారు చేయాలని చూస్తున్నందున ఈ ఇంజిన్‌లు భారతదేశానికి చాలా కీలకమని అధికారులు తెలిపారు. లైట్ కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ (LCA) ఎంకే2 2028 నాటికి ఇండక్షన్‌కు సిద్ధంగా ఉంటుందని అంచనా వేయబడింది. అయితే అడ్వాన్స్‌డ్ మీడియం కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ (AMCA) మొదటి విమానానికి ఏడు సంవత్సరాలు పట్టవచ్చు. ఇండక్షన్‌కి పదేళ్లు పట్టవచ్చు.

Read Also: Cabinet: కేంద్ర కేబినెట్‌లో మార్పులు.. కిరణ్‌ రిజిజు స్థానంలో అర్జున్‌ రామ్‌ మేఘ్వాల్

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వచ్చే నెల జూన్‌లో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా (యుఎస్‌ఎ) ను సందర్శించాల్సి ఉంది. అలాగే ఫ్రెంచ్ జాతీయ దినోత్సవంలో పాల్గొనడానికి ఈ ఏడాది చివర్లో ఫ్రాన్స్‌కు కూడా వెళ్లనున్నారు. రెండు జెట్ ఇంజిన్‌ల పనితీరును అలాగే ధరకు సంబంధించిన అంశాలను, సాంకేతికత, తయారీని బదిలీ చేసే పరిధిని భారతదేశం మూల్యాంకనం చేస్తోంది. లైట్ కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ తేజాస్ ఎంకే2, అధునాతన మీడియం కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ (AMCA) అనేవి రెండు ప్రధాన యుద్ధ విమానాలు. వీటి తయారీ ప్రాజెక్టులు ప్రస్తుతం భారతదేశంలో కొనసాగుతున్నాయి. భారతదేశం 114 మల్టీరోల్ ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్‌లను తయారు చేసే ప్రణాళికలను కలిగి ఉంది. మొదటిసారిగా విదేశీ రక్షణ సంస్థల భాగస్వామ్యంతో భారత్ ఫైటర్‌ జెట్లను తయారు చేస్తోంది.