ప్రపంచ దేశాలను భయాందోళనకు గురి చేసిన కరోనా రక్కసి ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతోంది. కొత్త కొత్తగా రూపాంతరాలు చెందుతూ ప్రజలపై విరుచుకుపడుతున్న కరోనా మహమ్మారి భారత్‌లోనూ తగ్గుతూ వస్తోంది. అయితే.. సోమవారం నాడు అప్‌డేట్ చేసిన కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం.. ఒక్క రోజులో 4,858 కొత్త కరోనావైరస్ ఇన్‌ఫెక్షన్లు నమోదవడంతో, భారతదేశంలో కోవిడ్ కేసుల సంఖ్య 4,45,39,046కి చేరింది. అయితే యాక్టివ్ కేసులు 48,027కి పెరిగాయి. 18 మరణాలతో మరణాల సంఖ్య 5,28,355కి చేరుకుంది. అయితే అత్యధికంగా కేరళలో ఎనిమిది మంది కరోనాతో మరణించారు.
మొత్తం ఇన్ఫెక్షన్‌లలో యాక్టివ్ కేసులు 0.11 శాతం ఉండగా, జాతీయ కోవిడ్ రికవరీ రేటు 98.71 శాతానికి పెరిగిందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం, రోజువారీ పాజిటివిటీ రేటు 2.76 శాతంగా నమోదైంది. వారంవారీ సానుకూలత రేటు 1.78 శాతంగా ఉంది. వ్యాధి నుండి కోలుకున్న వారి సంఖ్య 4,39,62,664కి పెరిగింది. కేసు మరణాల రేటు 1.19 శాతంగా ఉంది. దేశవ్యాప్తంగా కోవిడ్ వ్యాక్సినేషన్ డ్రైవ్ కింద ఇప్పటివరకు దేశంలో 216.7 కోట్ల డోస్‌ల వ్యాక్సిన్‌లు అందించబడ్డాయి.