NTV Telugu Site icon

Rohit Sharma: ఆ కారణంతోనే టాస్‌ నెగ్గి బౌలింగ్‌ ఎంచుకున్నా: రోహిత్ శర్మ

Rohit Sharma Interview Odi

Rohit Sharma Interview Odi

Rohit Sharma Press Conference after IND vs WI 1st ODI: మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా వెస్టిండీస్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ సునాయాస విజయం సాధించిన విషయం తెలిసిందే. స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్‌ (4), రవీంద్ర జడేజా (3) చెలరేగడంతో ముందుగా బ్యాటింగ్ చేసిన విండీస్‌ 23 ఓవర్లలో 114 పరుగులకే ఆలౌట్ అయింది. షై హోప్‌ (43; 45 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్) టాప్‌ స్కోరర్‌. స్వల్ప లక్ష్యాన్ని భారత్‌ 22.5 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఇషాన్‌ కిషన్‌ (52; 46 బంతుల్లో 7×4, 1×6) హాఫ్ సెంటిరీ చేశాడు. అయితే విండీస్‌ లాంటి జట్టుపై టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోక.. బౌలింగ్ ఎంచుకోవడం ఏంటని నెట్టింట విమర్శలు వచ్చాయి. ఈ విషయంపై కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు.

మ్యాచ్ అనంతరం రోహిత్ శర్మ మాట్లాడుతూ.. బౌలర్లను పరీక్షించేందుకు టాస్‌ నెగ్గగానే బౌలింగ్‌ ఎంచుకున్నా అని స్పష్టం చేశాడు. ‘బార్బడోస్‌ పిచ్‌ ఇలా స్పందిస్తుందని ఏమాత్రం అనుకోలేదు. బౌలర్లను పరీక్షించేందుకు ముందుగా బౌలింగ్‌ ఎంచుకున్నా. పేసర్లు, స్పిన్నర్లకు పిచ్‌ నుంచి సహకారం అందింది. బౌలర్లు అద్భుతంగా బౌలింగ్‌ చేసి విండీస్‌ను తక్కువ స్కోరుకే ఆలౌట్ చేశారు. ప్లేయర్లకు తగినన్ని అవకాశాలు ఇవ్వాలనేదే మా లక్ష్యం. వీలైనప్పుడు అవకాశాలు ఇచ్చి ప్రోత్సహిస్తాం’ అని రోహిత్ అన్నాడు.

Also Read: Sanju Samson Jersey: భారత్-వెస్టిండీస్‌ తొలి వన్డేలో సంజూ శాంసన్.. గందరగోళానికి గురైన ఫాన్స్!

‘వన్డే ప్రపంచకప్‌ 2023 నేపథ్యంలో జట్టును సమాయత్తం చేయాల్సిన అవసరం ఉంది. అందుకే ఆటగాళ్లకు ఎక్కువగా అవకాశాలు వస్తాయని చెప్పలేను. కానీ అవకాశం ఉన్నప్పుడల్లా ఆడిస్తాం. నేను ఏడో స్థానంలో రావడంపై చాలా మంది సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. నాకు ఇదేమీ కొత్త స్థానం కాదు. అరంగేట్ర సమయంలో ఇదే స్థానంలో బ్యాటింగ్‌ చేశాను. ఈరోజు మరోసారి ఆ రోజులు గుర్తొచ్చాయి. ముకేశ్‌ కుమార్‌ రెండు వైపులా బంతిని అద్భుతంగా స్వింగ్‌ చేయగలిగాడు. ఇక కుల్దీప్ యాదవ్‌, ఆర్ జడేజా, ఇషాన్‌ కిషన్‌ బాగా ఆడారు’ అని భారత కెప్టెన్ ప్రశంసించాడు.

స్వల్ప లక్ష్యం ఉండడంతో రోహిత్ శర్మ ఓపెనర్‌గా రాలేదు. ఇషాన్‌ కిషన్‌, శుభ్‌మన్‌ గిల్‌ ఓపెనింగ్ చేశారు. యువ క్రికెటర్లకు అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతోనే కెప్టెన్ రోహిత్ ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చాడు. అలాగే స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ కూడా బ్యాటింగ్‌కు దిగలేదు. సూర్యకుమార్‌ యాదవ్ మూడో స్థానంలో ఆడాడు. హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శార్దూల్‌ ఠాకూర్ బ్యాటింగ్‌లో ముందుకు వచ్చారు.

Also Read: IND vs PAK: భారత్, పాకిస్తాన్ మ్యాచ్ మాత్రమే కాదు.. ప్రపంచకప్ 2023 షెడ్యూల్‌లోనూ మార్పు!