NTV Telugu Site icon

Virat Kohli Century: ముగిసిన రెండో రోజు ఆట.. భారత్ ఆలౌట్! విండీస్‌ స్కోర్ 86/1

Virat Kohli Century

Virat Kohli Century

IND vs WI 2nd Test Day 2 Highlights: తొలి టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల్లో తక్కువ స్కోరుకే ఆలౌటై ఇన్నింగ్స్‌ తేడాతో ఓడిన వెస్టిండీస్.. పోర్ట్‌ ఆఫ్‌ స్పెయిన్‌ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో మాత్రం కాస్త ప్రతిఘటిస్తోంది. రెండో రోజైన శుక్రవారం ఆట ముగిసే సమయానికి విండీస్ 86/1 స్కోరుతో నిలిచింది. క్రెయిగ్ బ్రాత్‌వైట్ (37), కిర్క్ మెకంజీ (14) క్రీజులో ఉన్నారు. తొలి ఇన్నింగ్స్‌లో కరేబియన్ జట్టు ఇంకా 352 పరుగుల వెనుకంజలో ఉంది. అంతకుముందు భారత్ మొదటి ఇన్నింగ్స్‌లో 438 పరుగులకు ఆలౌటైంది.

ఓవర్‌ నైట్‌ స్కోరు 288/4తో రెండో రోజు ఆటను కొనసాగించిన టీమిండియాకు మంచి ఆరంభమే దక్కింది. 87 పరుగుల వ్యక్తిగత స్కోర్‌తో రెండో రోజు ఆడిన స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (121; 206 బంతుల్లో 11 ఫోర్లు) సెంచరీ చేశాడు. 180 బంతుల్లో శతకం బాదాడు. దాంతో కోహ్లీ నాలుగున్నరేళ్ల తర్వాత విదేశీ గడ్డపై సాధించాడు. ఆపై మొదటి రోజు 36 పరుగులు చేసిన జడేజా (61; 152 బంతుల్లో 5 ఫోర్లు) కూడా అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. అయితే సెంచరీ పూర్తి చేసుకున్న కోహ్లీ.. రనౌట్‌గా వెనుదిరిగాడు. కొద్దిసేపటికే జడేజా క్యాచ్‌ ఔట్ అయ్యాడు.

Also Read: Gold Price Today: బంగారం ప్రియులకు గుడ్‌న్యూస్.. తగ్గిన పసిడి ధరలు!

విరాట్ కోహ్లీ, ఆర్ జడేజా స్వల్ప వ్యవధిలో పెవిలియన్ చేరినా.. ఆర్ అశ్విన్‌ (56; 78 బంతుల్లో 8 ఫోర్లు) అర్ధ శతకంతో జట్టును అందుకున్నాడు. ఇషాన్‌ కిషన్ (25), జయదేవ్ ఉనద్కత్‌ (7)లతో కీలక భాగస్వామ్యాలు నెలకొల్పాడు. ఇషాన్, ఉనద్కత్‌, మొహ్మద్ సిరాజ్‌ (0)లు పెవిలియన్‌ చేరడంతో ధాటిగా ఆడిన అశ్విన్.. హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్నాడు. యాష్ బౌల్డవడంతో భారత్ ఇన్నింగ్స్‌కు తెరపడింది. విండీస్‌ బౌలర్లలో కీమర్‌ రోచ్‌, వారికన్‌ తలో మూడు వికెట్లు పడగొట్టారు.

భారత్ ఆలౌటైన అనంతరం బ్యాటింగ్‌కు దిగిన విండీస్‌కు ఓపెనర్లు క్రైగ్ బ్రాత్‌వైట్, త్యాగ్‌నారాయణ్‌ చందర్‌పాల్ (33) శుభారంభం ఇచ్చారు. ఆరంభంలో బ్రాత్‌వైట్ నిలకడగా ఆడినా.. త్యాగ్‌నారాయణ్ బౌండరీలు బాదాడు. అయితే ఊపుమీదున్న చందర్‌పాల్.. జడేజా బౌలింగ్‌లో అశ్విన్‌కు చిక్కాడు. దీంతో 71 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యానికి తెరపడింది. తర్వాత క్రీజులోకి వచ్చిన మెకంజీ ఓ సిక్స్‌, ఫోర్ బాదిన అనంతరం రెండో రోజు ఆట ముగిసింది.

Also Read: Owaisi: మణిపూర్ హింసాకాండపై ఒవైసీ ఫైర్.. మోడీ ఇమేజ్ గురించి భయపడుతున్నారు

Show comments