Jeffrey Vandersay on Sri Lanka 2nd ODI Win: ఆదివారం కొలంబో వేదికగా భారత్‌తో జరిగిన రెండో మ్యాచ్‌లో శ్రీలంక 32 పరుగుల తేడాతో విజయం సాధించింది. లంక యువ బౌలర్ జెఫ్రీ వాండర్సే 6 వికెట్లు తీసి రోహిత్ సేనను దెబ్బ కొట్టాడు. తన కోటా 10 ఓవర్లలో 33 రన్స్ మాత్రమే ఇచ్చి ఏకంగా 6 వికెట్స్ పడగొట్టాడు. రోహిత్, గిల్, విరాట్, దూబే, శ్రేయాస్, రాహుల్ వికెట్లను ఖాతాలో వేసుకున్నాడు. మంచి ఆరంభం ఇచ్చిన ఓపెనర్లు వాండర్సే రంగంలోకి దిగగానే పెవిలియన్ చేరారు. టీమిండియా టాప్ బ్యాటర్లు అందరూ వాండర్సే బౌలింగ్‌లోనే అవుట్ అవ్వడం విశేషం.
6 వికెట్లు తీసిన జెఫ్రీ వాండర్సేకు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ విజయం వెనుక తన స్పెల్‌తో పాటు శ్రీలంక బ్యాటర్ల పోరాటం ఉందన్నాడు. ‘నేను బౌలింగ్ చేసే సమయానికి మా జట్టుపై బాగా ఒత్తిడి ఉంది. చాలా రోజుల తర్వాత మైదానంలోకి దిగాను. జట్టు కోసం ఏదైనా చెలనుకున్నా. ఆరు వికెట్లు తీసినందుకు క్రెడిట్ తీసుకోవచ్చు కానీ మా విజయం వెనుక బ్యాటర్లదే కీలక పాత్ర. 240 చేసి మేం పోరాడేందుకు అవకాశం కల్పించారు. మా బ్యాటింగ్ బౌలింగ్ బాగుంది’ అని వాండర్సే అన్నాడు.
Also Read: IND vs SL: అతడి వల్లే మ్యాచ్‌లో ఓడాం: రోహిత్ శర్మ
‘సరైన ప్రాంతంలో బౌలింగ్ వేయడంతో వికెట్లు దక్కాయి. నెంబర్ వన్ బౌలర్ వనిందు హసరంగ లేకపోవడం జట్టుకు పెద్ద లోటే. జట్టు సమతూకంగా ఉండేందుకు ప్రయత్నించాం. పిచ్ నుంచి కూడా మంచి సహకారం లభించడంతో మాపని తేలికైంది. తొలి వికెట్ తీశాక నాలో ఆత్మవిశ్వాసం పెరిగింది. అదే కంటిన్యూ చేసి ఆరు వికెట్లు పడగొట్టా. చాలా సంతోషంగా ఉంది. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ.. లంక విజయాల్లో భాగం అవుతా’ అని జెఫ్రీ వాండర్సే చెప్పుకొచ్చాడు. లంక తరఫున వాండర్సే 1 టెస్ట్, 23 వన్డేలు, 14 టీ20లు ఆడాడు.