NTV Telugu Site icon

Virat Kohli-Rohit Sharma: విరాట్ కోహ్లీ అద్భుతంగా ఆడాడు.. అతడు మాకు ఎంతో అవసరం: రోహిత్

Virat Kohli Hugs Rohit Sharma

Virat Kohli Hugs Rohit Sharma

India Captain Rohit Sharma Heap Praise on Virat Kohli: వన్డే కెరీర్‌లో 49వ సెంచరీ చేసిన టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీపై భారత కెప్టెన్ రోహిత్ శర్మ ప్రశంసలు కురిపించాడు. కఠిన పరిస్థితుల్లో కోహ్లీ అద్భుతంగా ఆడాడని, అతడు జట్టుకు ఎంతో అవసరం అని తెలిపాడు. కోహ్లీ నుంచి మరెన్నో ఇన్నింగ్స్‌లు ఆశిస్తున్నామని తెలిపాడు. జట్టులోని ప్రతి ఒక్కరూ రాణించడం సంతోషంగా ఉందని రోహిత్ పేర్కొన్నాడు. ఆదివారం దక్షిణాఫ్రికాపై భారత్ ఏకంగా 243 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ అనంతరం రోహిత్ మాట్లాడుతూ జట్టు విజయంపై స్పందించాడు.

‘గత మూడు మ్యాచులను ఓసారి చూస్తే.. మేం పరిస్థితులకు తగ్గట్టుగా ఎలా మెరుగయ్యామో తెలుస్తుంది. ఇంగ్లండ్‌తో తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొని విజయం సాధించాం. మోస్తరు స్కోరు మాత్రమే చేసినా.. బౌలర్లు అద్భుత విజయం అందించారు. శ్రీలంకపై తొలి ఓవర్‌లోనే వికెట్‌ కోల్పోయినా భారీ పరుగులు చేశాం. ఆపై లంకను 55 పరుగులకే ఆలౌట్‌ చేశాం. దక్షిణాఫ్రికా మ్యాచ్‌లో వికెట్స్ చేజార్చుకున్నా.. విరాట్ కోహ్లీ అద్భుతంగా ఆడాడు. ఆ పరిస్థితుల్లో కోహ్లీ అనుభవం జట్టుకు ఉపయోగపడింది. అతడు జట్టుకు అవసరం. విరాట్ నుంచి ఇలాంటి ఇన్నింగ్స్‌లు మరిన్ని ఆశిస్తున్నాం. హార్డ్‌ హిట్టర్లు ఉన్న దక్షిణాఫ్రికా లాంటి జట్టును ఆలౌట్ చేయడం తేలికైన విషయం కాదు. మా బౌలర్లు సూపర్. లైన్‌ అండ్‌ లెంగ్త్‌ బంతులు వేసి కట్టడి చేశారు. జట్టులోని ప్రతి ఒక్కరూ తమ బాధ్యతలను బాగా నిర్వర్తిస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది’ అని రోహిత్ శర్మ తెలిపాడు.

Also Read: Sunil Narine Retirement: సునీల్ నరైన్ సంచలన నిర్ణయం.. క్రికెట్‌కు వీడ్కోలు! కానీ..

‘శ్రేయస్‌ అయ్యర్ తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ముచేయలేదు. బాగా ఆడుతున్నాడు. గాయపడిన తర్వాత భారీ సిక్సులు కొట్టడం అసాధ్యం. ఆటగాళ్లపై నమ్మకం ఉంచితేనే గొప్ప ప్రదర్శనలు వస్తాయి. అయితే ప్రతిసారీ రాణించడం కష్టమే. మొహ్మద్ షమీ కమ్‌బ్యాక్‌ను అందరూ ఆస్వాదిస్తున్నారు. శుభమాన్ గిల్‌తో కలిసి చాలా మ్యాచ్‌ల్లో ఓపెనింగ్‌ చేస్తూ వస్తున్నా. గిల్ చాలా బాగా బంతిని ఎదుర్కొంటున్నాడు. రవీంద్ర జడేజా తన మాయను కొనసాగిస్తున్నాడు. ప్రతి ఫార్మాట్‌లోనూ జడ్డూ అద్భుతంగా రాణిస్తున్నాడు. దక్షిణాఫ్రికాపై అయితే క్లాసిక్‌ బౌలింగ్‌ వేశాడు. బుమ్రా, సిరాజ్, కుల్దీప్ రాణిస్తున్నారు. రాబోయే మ్యాచులు చాలా కీలకం కాబట్టి జట్టులో ఎలాంటి మార్పులు చేయకూడదనుకుంటున్నాం అని రోహిత్ శర్మ చెప్పాడు.

 

Show comments