NTV Telugu Site icon

Rohit Sharma: ఇకనైనా నోరుపారేసుకోవడం ఆపితే మంచిది.. విమర్శకులకు గట్టి కౌంటరిచ్చిన రోహిత్!

Rohit Sharma Test

Rohit Sharma Test

Rohit Sharma on Cape Town Pitch: భారత్‌ పిచ్‌లపై విమర్శలు చేసే వారికి టీమిండియా కెప్టెన్ రోహిత్‌ శర్మ గట్టి కౌంటర్ ఇచ్చాడు. ఇది కూడా క్రికెట్‌ పిచే కదా అని, ఆడింది మ్యాచే కదా అని విమర్శించాడు. కేప్‌టౌన్‌లో ఏం జరిగిందో మ్యాచ్‌ రిఫరీలకు, ఐసీసీకి కనబడిందనే అనుకుంటున్నానని.. మరి దీనికేం రేటింగ్‌ ఇస్తారు? అని ప్రశ్నించారు. భారత్‌కు వచ్చినప్పుడు ఇదేం చెత్త అని నోరుపారేసుకోవడం ఆపితే మంచిదని రోహిత్ ఫైర్ అయ్యాడు. కేప్‌టౌన్‌ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్టులో 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.

టెస్ట్‌ క్రికెట్‌ చరిత్రలో బంతుల పరంగా అత్యంత వేగంగా ముగిసిన మ్యాచ్‌గా కేప్‌టౌన్‌ టెస్టు రికార్డుల్లోకి ఎక్కింది. ఒకటిన్నర రోజుల్లోనే మ్యాచ్ ముగిసింది. కేప్‌టౌన్‌ పిచ్‌పై ప్రస్తుతం క్రికెట్‌ వర్గాలపై చర్చనడుస్తోంది. ఈ నేపథ్యంలోనే భారత్‌ పిచ్‌లపై విమర్శలు చేసే వారికి టీమిండియా సారథి రోహిత్‌ శర్మ గట్టి కౌంటరిచ్చాడు. ‘ఇది కూడా క్రికెట్‌ పిచే, ఆడింది మ్యాచే. మ్యాచ్‌ రిఫరీలకు, ఐసీసీకి ఏం జరిగిందో తెలుసనుకుంటున్నా. మరి ఈ పిచ్‌కు ఏ రేటింగ్‌ ఇస్తారు?. భారత్‌లో వన్డే ప్రపంచకప్‌ 2023 ఫైనల్‌ కోసం తయారు చేసిన పిచ్‌పై ఓ బ్యాటర్‌ సెంచరీ చేశాడు. అయినా దానికి యావరేజ్‌ రేటింగ్‌ ఇస్తారు. ఐసీసీ, మ్యాచ్ రిఫరీలు తటస్థంగా ఉండాలి’ అని రోహిత్‌ అన్నాడు.

Also Read: Jasprit Bumrah: నా హృదయంలో ఈ మైదానానికి ఎప్పుడూ ప్రత్యేక స్థానం ఉంటుంది!

‘కేప్‌టౌన్‌లో ఏం జరిగిందో అందరూ చూశారు. ఈ పిచ్‌ ఎలా ఉందో అందరికీ తెలుసు. నిజాయితీగా చెప్పాలంటే ఇలాంటి పిచ్‌లపై ఆడేందుకు నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. విదేశీ జట్లు భారత్‌కు వచ్చినప్పుడు స్పిన్‌ తిరిగి మూడు రోజుల్లో ముగిస్తే.. ఇవేం పిచ్‌లు, ఇదేం చెత్త అని నోరుపారేసుకోవడం ఇకనైనా ఆపితే మంచిది’ అని రోహిత్ శర్మ కౌంటర్ ఇచ్చాడు. రెండో టెస్టులో అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన భారత్ కేవలం ఒకటిన్నర రోజుల్లోనే మ్యాచ్‌ను ముగించింది. రెండు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌ను 1-1తో సమం చేసింది.