NTV Telugu Site icon

Jasprit Bumrah: నా హృదయంలో ఈ మైదానానికి ఎప్పుడూ ప్రత్యేక స్థానం ఉంటుంది!

Jasprit Bumrah 5 Wickets

Jasprit Bumrah 5 Wickets

తన హృదయంలో కేప్‌టౌన్‌ మైదానానికి ఎప్పుడూ ప్రత్యేక స్థానం ఉంటుందని టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా తెలిపాడు. టెస్ట్ మ్యాచ్ ఇంత తొందరగా ముగుస్తుందని తాను ఊహించలేదని, టెస్టు క్రికెట్‌ సంభ్రమాశ్చర్యాలను కలిగిస్తుందన్నాడు. విదేశీ పరిస్థితుల్లో రాణించాలంటే నిలకడగా బౌలింగ్ చేయాల్సి ఉంటుందని బుమ్రా చెప్పాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్‌లో భారత్ 7 వికెట్ల తేడాతో గెలిచింది. రెండో ఇన్నింగ్స్‌లో బుమ్రా (6/61) ప్రొటీస్ జట్టు పతనాన్ని శాసించాడు. రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను భారత్ 1-1తో సమం చేసింది.

రెండు టెస్టుల్లో రాణించిన జస్ప్రీత్ బుమ్రాకు ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ దక్కింది. ఈ సందర్భంగా బుమ్రా మాట్లాడుతూ… ‘నా హృదయంలో ఈ మైదానానికి ఎప్పుడూ ప్రత్యేక స్థానం ఉంటుంది.టెస్ట్ క్రికెట్ ఆడాలనేది నా కల. 2018లో ఇక్కడే నా ప్రయాణం మొదలైంది. నా మొదటి గేమ్‌కు సంబంధించిన మధురమైన జ్ఞాపకాలు ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు కూడా బాగా బౌలింగ్ చేశా. అనుభవం ఉన్న మా బౌలింగ్‌ దళం ప్రభావం చూపించాలనుకున్నాం. విదేశీ పరిస్థితుల్లో రాణించాలంటే.. మేము నిలకడగా బౌలింగ్ చేయాల్సి ఉంటుందని తెలుసు. భారతదేశంలో స్పిన్నర్లు చాలా ప్రభావం చూపుతారు. విదేశీ గడ్డపై మా పేసర్లు బాగా రాణిస్తున్నారు’ అని తెలిపాడు.

Also Read: Gold Price Today : గుడ్ న్యూస్…భారీగా తగ్గిన బంగారం ధర..ఈరోజు ఎంతంటే?

‘జట్టులో చాలా మంది బౌలర్లు మార్చబడ్డారు. కానీ సందేశం మాత్రం ఒకటే.. ఎపుడూ పోరాడుతూనే ఉండాలి. దక్షిణాఫ్రికాలో ఆడటం అంత సులువు కాదు. విభిన్న పరిస్థితులు ఉంటాయి. చివరి గేమ్‌లోనూ మేం పోరాడాం. ఇక్కడ రాణించాలంటే బలం మరియు ఓపిక అవసరం. మీరు దాన్ని పోగొట్టుకుంటే.. ఒక సెషన్‌లోనే మ్యాచ్ చేతుల్లో లేకుండా పోతుంది. ఈ మ్యాచ్‌లో ఫలితం దక్కినందుకు ఆనందంగా ఉంది. మ్యాచ్ ఇంత తొందరగా మ్యాచ్‌ ముగుస్తుందని ఊహించలేదు. నా జీవితంలో ఎప్పుడూ ఇంత తక్కువ టెస్ట్ మ్యాచ్ ఆడలేదు. తొలిరోజు వికెట్‌ని చూస్తే ఇంత త్వరగా ముగుస్తుందని ఎవరూ ఊహించలేదు. టెస్టు క్రికెట్‌ సంభ్రమాశ్చర్యాలను కలిగిస్తుంది. టాస్‌ గెలిస్తే మేం కూడా మొదట బ్యాటింగ్‌ చేయాలనుకున్నాం. కేప్ టౌన్‌లో మా మొదటి విజయం ఇది. గొప్ప సిరీస్’ అని జస్ప్రీత్ బుమ్రా చెప్పాడు.

Show comments