India Champions wins World Championship of Legends 2024 Under Yuvraj Singh Captancy: వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ (డబ్ల్యూసీఎల్) 2024 విజేతగా భారత్ నిలిచింది. శనివారం అర్ధరాత్రి బర్మింగ్‌హామ్‌లో పాకిస్థాన్ ఛాంపియన్స్‌తో జరిగిన ఫైనల్లో ఇండియా ఛాంపియన్స్ 5 వికెట్ల తేడాతో గెలిచింది. పాక్ నిర్ధేశించిన 157 పరుగుల లక్ష్యాన్ని భారత్ 5 వికెట్స్ కోల్పోయి మరో 5 బంతులు ఉండగానే ఛేదించింది. భారత్ విజయంలో తెలుగు తేజం అంబటి రాయుడు (50; 30 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లు), యూసఫ్ పఠాన్ (30; 16 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్సర్లు) కీలక పాత్ర పోషించారు.
డబ్ల్యూసీఎల్ 2024 ఫైనల్ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ ఛాంపియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 156 పరుగులు చేసింది. షోయబ్ మాలిక్ (41; 36 బంతుల్లో 3 ఫోర్లు) టాప్ స్కోరర్. కర్మన్ అక్మల్ (24), సోహైబ్ మక్సూద్ (21), సోహైల్ తన్వీర్ (18), మిస్బా-ఉల్-హక్ (18) పరుగులు చేశారు. భారత పేసర్ అనురీత్ సింగ్ మూడు వికెట్స్ పడగొట్టాడు. వినయ్ కుమార్, పవన్ నేగి, ఇర్ఫాన్ పఠాన్ తలో వికెట్ తీసారు. ఇర్ఫాన్ మూడు ఓవర్లలో 12 రన్స్ మాత్రమే ఇచ్చాడు.
Also Read: Wimbledon 2024 Winner: వింబుల్డన్ కొత్త రాణిగా బార్బోరా క్రెజికోవా!
లక్ష్య చేధనలో ఇండియా ఛాంపియన్స్ 19.1 ఓవర్లలో 5 వికెట్లకు 159 పరుగులు చేసి విజయం సాధించింది. అంబటి రాయుడు హాఫ్ సెంచరీ చేయగా.. యూసఫ్ పఠాన్ మెరుపులు మెరిపించాడు. గుర్‌క్రీత్ సింగ్ (34) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. కెప్టెన్ యువరాజ్ సింగ్ 22 బంతుల్లో 15 రన్స్ మాత్రమే చేశాడు. పాకిస్థాన్ బౌలర్లలో అమీర్ యామిన్ 2 వికెట్లు తీయగా.. సయీద్ అజ్మల్, షోయబ్ మాలిక్, వాహబ్ రియాజ్ తలో వికెట్ పడగొట్టారు. 15 రోజుల క్రితమే భారత్ టీ20 ప్రపంచకప్ గెలిచిన విషయం తెలిసిందే. రెండు అద్భుత విజయాలతో భారత అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.