India Star Virat Kohli Out from first two England Tests: తెలుగు క్రికెట్ అభిమానులకు బ్యాడ్‌న్యూస్. ఇంగ్లండ్‌తో హైదరాబాద్, వైజాగ్ వేదికలుగా జరిగే తొలి రెండు టెస్టు మ్యాచ్‌లకు భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ దూరం అయ్యాడు. వ్యక్తిగత కారణాలతో కోహ్లీ తప్పుకున్నట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఓ ప్రకటనలో తెలిపింది. విరాట్ దూరం కావడానికి కారణంపై ఊహాగానాలు అస్సలు చేయొద్దని మీడియా, అభిమానులను బీసీసీఐ కోరింది. ఐదు టెస్టుల సిరీస్ కోసం ఇంగ్లండ్ ఆటగాళ్లు ఆదివారమే హైదరాబాద్ చేరుకున్నారు.
‘వ్యక్తిగత కారణాల వల్ల ఇంగ్లండ్‌తో జరిగే తొలి రెండు మ్యాచ్‌ల నుంచి తప్పించాలని బోర్డుకు విరాట్ కోహ్లీ విజ్ఞప్తి చేశాడు. కెప్టెన్ రోహిత్ శర్మ, జట్టు మేనేజ్‌మెంట్, సెలక్టర్లతో విరాట్ మాట్లాడాడు. దేశానికి ప్రాతినిధ్యం వహించడానికే ఎప్పుడూ ప్రాధాన్యతనిస్తానని చెప్పిన కోహ్లీ.. కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల తాను అందుబాటులో ఉండలేనన్నాడు. విరాట్ నిర్ణయాన్ని బీసీసీఐ గౌరవిస్తుంది. బోర్డు, టీమ్‌మేనేజ్‌మెంట్ అతడికి మద్దతు తెలిపాయి’ అని ప్రకటనలో బీసీసీఐ కార్యదర్శి జై షా తెలిపాడు. విరాట్ ఏకాంతాన్ని గౌరవించాలని.. అతడి వ్యక్తిగత కారణాలపై ఊహాగానాలు చేయొద్దని మీడియా, అభిమానులను బీసీసీఐ కోరింది.
విరాట్ కోహ్లీ వ్యక్తిగత కారణాలతో ఇటీవల అఫ్గానిస్థాన్‌తో టీ20 సిరీస్‌లోని తొలి మ్యాచ్‌కు దూరంగా ఉన్నాడు. అంతకుముందు దక్షిణాఫ్రికా పర్యటన సందర్భంగా కూడా వ్యక్తిగత కారణాలతో విరామం తీసుకున్నాడు. 2021లో టెస్టు సిరీస్ సందర్భంగా విరాట్ విరామం తీసుకున్నాడు. అప్పుడు భార్య అనుష్క శర్మ ప్రసవం కోసం టెస్ట్ మ్యాచ్ ఆడలేదు. ఇప్పుడు కూడా అనుష్క గర్భవతి. ఆమెను దగ్గరుండి తీసుకోవడం కోసమే విరాట్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
Also Read: China : చైనాలో కొండచరియలు విరిగిపడి.. 8 మంది మృతి, 39 మంది గల్లంతు
భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య జనవరి 25 నుంచి హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో తొలి టెస్టు, ఫిబ్రవరి 2 నుంచి విశాఖపట్నంలోని వైఎస్ రాజశేఖర రెడ్డి ఏసీఏ–వీడీసీఏ స్టేడియంలో రెండో టెస్టు జరగనుంది. విరాట్ కోహ్లీ ఫాన్స్ తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ఈ రెండు టెస్టుల నుంచి అతడు తప్పుకోవడంతో ఫాన్స్ నిరాశ చెందుతున్నారు.