టీమిండియా కెప్టెన్, హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ చరిత్ర సృష్టించాడు. భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన రెండో ఓపెనర్‌గా రికార్డుల్లో నిలిచాడు. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఆదివారం ఇంగ్లండ్‌తో జరిగిన రెండో మ్యాచ్‌లో సెంచరీ (119; 90 బంతుల్లో 12 ఫోర్లు, 7 సిక్స్‌లు) చేయడంతో ఈ ఘనత సొంతమైంది. మూడు ఫార్మాట్‌లలో కలిపి ఓపెనర్‌గా రోహిత్ ఇప్పటి వరకు 15,404 పరుగులు చేశాడు. తద్వారా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్‌ను హిట్‌మ్యాన్ అధిగమించాడు.
సచిన్ టెండూల్కర్ మూడు ఫార్మాట్‌లలో కలిపి ఓపెనర్‌గా 15,335 పరుగులు చేశాడు. ఈ జాబితాలో మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ 15,758 పరుగులతో అగ్రస్థానంలో ఉన్నాడు. త్వరలోనే వీరూ రికార్డును కూడా రోహిత్ బద్దలు కొట్టే అవకాశం ఉంది. వచ్చే నెలలో ఆరంభం కానున్న ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో హిట్‌మ్యాన్ చెలరేగితే సెహ్వాగ్ ఆల్‌టైమ్ రికార్డు బ్రేక్ అవుతుంది. రోహిత్ 2007లో అరంగేట్రం చేసిన విషయం తెలిసిందే. అయితే వీరేంద్ర సెహ్వాగ్, సచిన్ టెండూల్కర్ రిటైర్మెంట్ అనంతరం 2013లో రోహిత్ ఓపెనర్‌గా ప్రమోట్ అయ్యాడు. మిడిల్ ఆర్డర్ బ్యాటర్ అయిన రోహిత్‌ను మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ ఓపెనర్‌గా మార్చాడు. అనతి కాలంలోనే హిట్‌మ్యాన్‌గా పేరు తెచ్చుకున్నాడు.
Also Read: Virat Kohli: జోస్ బట్లర్ వల్లే విరాట్ కోహ్లీ త్వరగా ఔట్!
మరోవైపు అంతర్జాతీయ మ్యాచ్‌లలో అత్యధిక సెంచరీలు చేసిన టీమిండియా ఆటగాళ్లలో రోహిత్ శర్మ మూడో స్థానంలో ఉన్నాడు. మూడు ఫార్మాట్‌లలో కలిపి 49 శతకాలు బాదాడు. ఈ జాబితాలో సచిన్ టెండ్యూలర్ (100 సెంచరీలు), విరాట్ కోహ్లీ (81 సెంచరీలు) మొదటి రెండు స్థానాల్లో ఉన్నారు. ఇక వన్డే క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో టాప్-10లోకి హిట్‌మ్యాన్ దూసుకొచ్చాడు. ప్రస్తుతం రోహిత్ 10,964 పరుగులతో నాలుగో భారత బ్యాటర్‌గానూ ఉన్నాడు. సచిన్ (18,426 పరుగులు), కోహ్లీ (13,906), గంగూలీ (11,363) మొదటి మూడు స్థానాల్లో ఉన్నారు.