Site icon NTV Telugu

Virat Kohli: నేను చెప్పిందంతా అబద్ధం.. విరాట్ విషయంలో డివిలియర్స్‌ యూటర్న్‌!

Ab De Villiers

Ab De Villiers

AB de Villiers Takes U-turn his comments regarding Virat Kohli: టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ విషయంలో దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్‌ ఏబీ డివిలియర్స్‌ యూటర్న్‌ తీసుకున్నాడు. విరాట్‌-అనుష్క శర్మ దంపతుల గురించి తాను చెప్పిందంతా అబద్ధం అని, కోహ్లీ వ్యక్తిగత విషయాలను యూట్యూబ్‌ చానెల్‌లో మాట్లాడి తాను పెద్ద తప్పు చేశాను అని పేర్కొన్నాడు. వ్యక్తిగత కారణాల కారణంగా ఇంగ్లండ్‌తో మొదటి రెండు టెస్ట్ మ్యాచ్‌లకు విరాట్ దూరం అయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో విరాట్ కుటుంబ సభ్యుల గురించి సోషల్ మీడియాలో పలు వదంతులు వ్యాపించాయి.

విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మ గర్భవతి అని, అందుకే రికార్డుల రారాజు ఇంగ్లండ్‌తో మొదటి రెండు టెస్ట్ మ్యాచ్‌లకు విరామం తీసుకున్నాడని సోషల్ మీడియాలో ముందుగా వార్తలు వచ్చాయి. ఆ తర్వాత.. తల్లి అనారోగ్యం కారణంగానే విరాట్ ఆటకు దూరమయ్యాడని వార్తలు వచ్చాయి. అయితే తమ తల్లి సరోజ్‌ కోహ్లీ ఆరోగ్యంగానే ఉన్నారని విరాట్ సోదరుడు వికాస్‌ స్పష్టం చేశాడు. అదే సమయంలో తన యూట్యూబ్‌ చానెల్‌లో ఏబీ డివిలియర్స్‌ మాట్లాడుతున్న సందర్భంలో విరాట్ గురించి ప్రస్తావన వచ్చింది. ‘విరాట్ బాగానే ఉన్నాడు. విరాట్-అనుష్క దంపతుల రెండో బిడ్డ త్వరలోనే ఈ ప్రపంచంలోకి రానుంది’ అని డివిలియర్స్‌ చెప్పాడు. దీంతో విరుష్క దంపతులు రెండోసారి తల్లిదండ్రులు కాబోతున్నారని ఏబీడీ స్పష్టం చేశాడు.

Also Read: KS Bharat: రిషబ్ పంత్ కోలుకుంటున్నాడు.. భరత్‌ రాణిస్తేనే భవిష్యత్తులో అవకాశాలు!

అయితే తాజాగా ఏబీ డివిలియర్స్‌ తన వ్యాఖ్యలపై యూటర్న్‌ తీసుకోవడం గమనార్హం. విరాట్‌-అనుష్క దంపతుల గురించి తాను చెప్పిందంతా అబద్ధం అని పేర్కొన్నాడు. దైనిక్‌ భాస్కర్‌తో డివిలియర్స్‌ మాట్లాడుతూ… ‘నా యూట్యూబ్ ఛానెల్‌లో నేను చెప్పినట్లుగా క్రికెట్‌ కంటే కుటుంబమే ప్రథమ ప్రాధాన్యం. నా యూట్యూబ్ ఛానెల్‌లో మాట్లాడుతూ నేను ఓ పెద్ద తప్పు చేశా. ఆరోజు నేను చెప్పిందంతా అబద్ధం. అందులో ఏమాత్రం నిజం లేదు. విరాట్‌ కుటుంబానికి ఏది మంచిదో అదే జరగాలని కోరుకుంటున్నా. అక్కడ ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. విరాట్ విరామానికి కారణం ఏమైనప్పటికీ.. అతడు మరింత రెట్టించిన ఉత్సాహంతో మైదానంలో అడుగుపెట్టాలని కోరుకుంటున్నా’ అని అన్నాడు.

Exit mobile version